
ఆరిలోవ (విశాఖ తూర్పు): పసి వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడంతోపాటు తండ్రిని కోల్పోయి హృద్రోగం బారినపడ్డ ఓ బాలుడి వ్యథ తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరిలోవలోని శ్రీకాంత్‌నగర్‌కు చెందిన వానపల్లి పార్వతి కుమారుడు వానపల్లి చరణ్‌సాయి మణికంఠ(12)కు మూడేళ్ల వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.
అయితే ఇప్పుడు మరోసారి శస్త్ర చికిత్స అవసరమని, అందుకు రూ.8 లక్షలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయారు. అపోలో క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంబోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుండగా పెదగదిలి కూడలి వద్ద ‘నా కుమారుడిని రక్షించండి జగనన్నా..’ అంటూ కేకలు వేసింది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ తన కారు ఆపి విషయం తెలుసుకుని చలించిపోయారు.
తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ఆదేశించారు. జేసీ విశ్వనాథన్, రూరల్ తహశీల్దారు పి.రమణయ్య సాయంత్రం బాలుడి ఇంటికి వెళ్లి తక్షణం సాయంగా రూ.లక్ష చెక్కు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బాలుడికి వైద్య సాయం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దేవుడిలా తన కుమారుడిని కాపాడేందుకు వచ్చారని బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మంత్రి గుడివాడ అమర్‌నా«థ్‌కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.