
సాక్షి, గుంటూరు: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే. పార్టీ పెట్టిన కొత్తలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నామీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు నాతో వచ్చారు. నా ప్రస్థానం అక్కడ నుంచి మొదలయ్యింది..
.. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది. పార్లమెంటులో ప్రతి సభ్యుడూ మనవైపు చూసే పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక మనమీద పగబట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే.. వాళ్లందరిచేతా రాజీనామా చేయించాను. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసే పోటీచేశాయి. 2014లో 67 మందితో గెలిచాం. మళ్లీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారు.
.. ఎన్నికష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలి. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇవి చేయగలిగితే.. లీడర్‌గా ఎదుగుతారు.

యూత్ వింగ్‌లో ఉన్న వారు ప్రభావంతంగా పనిచేయాలి. రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని రాజకీయంగా పెంచడం నా చేతుల్లో ఉంది. పెరగాలంటే.. మీరు కష్టపడాలి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి. సమర్థత ఉన్నవారిని పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురండి. పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయాలి.

.. మీ పనితీరును మీరు ఎప్పటికప్పుడు మీరే మదింపు చేసుకోండి. జోన్ల వారీగా యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా పెడుతున్నాం. ఎమ్మెల్యేలుగా పోటీచేసిన యువకులు దీనికి ఉంటారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోకి రావాలి. వాస్తవాలను చెప్పడానికి ఇది ఒక ఆయుధం. అన్యాయాలను, అక్రమాలను ఈ మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకురావాలి. ప్రజలందరి దృష్టికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. ఎవరికి, ఏ అన్యాయం జరిగినా సమాజం దృష్టికి తీసుకు రావాలి అని వైఎస్ జగన్ సూచించారు.

ఈ భేటీలో యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు.