సాక్షి,తాడేపల్లి: విశాఖ తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల సముద్రంలో మత్స్యకారుల బోటు నిలిచిపోవడం, ఆ తర్వాత వారితో సంబంధాలు తెగిపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, మెరైన్ పోలీసు విభాగాలను సమన్వయం చేసుకుంటూ రంగంలోకి దించాలని సూచించారు. అవసరమైతే గాలింపు చర్యల కోసం అదనపు నౌకలను, హెలికాప్టర్లను కూడా వినియోగించి, మత్స్యకారులను ప్రాణాలతో తిరిగి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.


