
మహిళా న్యాయవాదికి వైఎస్ జగన్ భరోసా
నరసరావుపేట రూరల్: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఇంటి మీద దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నరసరావుపేట పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది కె.స్నేహరెడ్డి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు.
సత్తెనపల్లి రోడ్డులో నివసిస్తున్న తనను స్థానికంగా ఉంటున్న ఆనం శివ అనే వ్యక్తి వెంటపడి వేధిస్తున్నాడని, ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్‌తో పాటు పబ్లిక్ గ్రీవెన్స్‌లో రెండుసార్లు జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశానని వివరించారు.
నిందితుడు జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, తనపైనే కౌంటర్ కేసు పెడతామని టూటౌన్ పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. అధైర్య పడొద్దని వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు.