యువత నిజాయతీని మెచ్చి రూ.10 వేల కానుక

Youth Found Currency Bag And Gives To Police In Peddapuram - Sakshi

ఏటీఎం వద్ద దొరికిన రూ.3.50 లక్షలు

పోలీసులకు అప్పగించిన యువకులు

వారి నిజాయతీకి మెచ్చి రూ.10 వేల నగదు కానుక

పెద్దాపురం: పది రూపాయలు దొరికితే జేబులో వేసుకునే నేటి కాలంలో అక్షరాలా రూ.3.50 లక్షల నగదు దొరికితే వెంటనే సొంతం చేసేసుకోవాలనే దుర్బుద్ధే చాలామందికి పుడుతుంది. కానీ, తాము మాత్రం అందుకు భిన్నమని నిరూపించి, పదిమందికి ఆదర్శంగా నిలిచారా యువకులు. ఎస్సై రావూరి మురళీమోహన్‌ కథనం ప్రకారం.. స్థానిక వడ్లమూరు రోడ్డులోని ఎపెక్స్‌ రొయ్యల పరిశ్రమలో సర్దార్‌ అనే వ్యక్తి కార్మిక కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. పట్టణంలోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో రూ.3.50 లక్షలు డ్రా చేసి, చివరిగా స్థానిక సూర్యారావు హోటల్‌ వెనక ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ కొంత నగదు డ్రా చేసి, జేబులో పెట్టుకుని, చేతిలో ఉన్న నగదు బ్యాగ్‌ను అక్కడే మరచిపోయి వెళ్లిపోయాడు.

కొద్దిసేపటికి సూరంపాలెం రోడ్డులోని కోరమండల్‌ పరిశ్రమలో మిషన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పెంటకోట రవీంద్ర, భువనేశ్వర్‌కు చెందిన సంతోశ్‌రెడ్డి, బిహార్‌కు చెందిన అమిత్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంకు నగదు డ్రా చేసేందుకు వెళ్లారు. అక్కడ క్యాష్‌ బ్యాగ్‌ కనబడడంతో కలవరపడి వెంటనే తమ సూపర్‌వైజర్‌ సుధీర్‌కు సమాచారం అందించారు. ఆయన సూచన మేరకు ఆ బ్యాగ్‌ను పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై మురళీమోహన్‌కు అందజేశారు. అదే సమయానికి బ్యాగ్‌ పోగొట్టుకున్న విషయంపై ఫిర్యాదు చేసేందుకు సర్దార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నారు. పోయిందనుకున్న క్యాష్‌ బ్యాగ్‌ను తిరిగి అప్పగించిన ఆ యువకులను ఎస్సై మురళీమోహన్, రొయ్యల పరిశ్రమ హెచ్‌ఆర్‌ ప్రతినిధి భరత్, సర్దార్‌ అభినందించి, రూ.10 వేల నగదు, శాలువతో సత్కరించారు. నిజాయతీని చాటుకున్న ఆ యువకులను పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top