ఏపీకి ప్రపంచ బ్యాంక్‌ బృందం రాక

World Bank team to visit Andhra Pradesh - Sakshi

నేడు ప్రపంచ బ్యాంక్‌ బృందం రాక

ఇథియోపియాలో ఏపీ విధానాలు అమలుకు అధ్యయనం

సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించనుంది. తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఆర్బీకే తరహాలో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వరల్డ్‌ బ్యాంక్‌ ఆర్థిక చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్యతో పాటు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం గత నెలలో ఇథియోపియాలో పర్యటించింది.

ఏపీ వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు వరల్డ్‌ బ్యాంక్‌లోని అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ గ్లోబల్‌ ప్రాక్టీస్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ హిమ్మత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం 8.45 గంటలకు విజయవాడ చేరుకోనుంది. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శిస్తారు.

అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరు చేరుకుని ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించి రైతులతో భేటీ అవుతారు. అనంతరం ఘంటసాలలోని కేవీకేని సందర్శిస్తారు. అనంతరం విజయవాడ చేరుకుని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో భేటీ అవుతారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top