కోలాటాలు, ర్యాలీలు

Women of thrift societies thanking YS Jagan For YSR Asara Scheme - Sakshi

పండుగలా ‘వైఎస్సార్‌ ఆసరా’ సంబరాలు

అప్పు డబ్బు రెండో విడత నేరుగా మహిళల ఖాతాల్లో జమ

సీఎం జగన్‌ ఫొటోలకు ఊరూరా క్షీరాభిషేకం

ఆరు రోజుల్లో 4.74 లక్షల సంఘాలకు రూ.3,816.31 కోట్లు పంపిణీ  

లబ్ధిదారులతో మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖాముఖీ

నాడు చంద్రబాబు మోసం, నేడు జగన్‌ హామీల అమలుపై ప్రధానంగా చర్చ 

వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న పొదుపు సంఘాల మహిళలు

18 వరకు కొనసాగనున్న కార్యక్రమం

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌ : రాష్ట్రంలో ఒక పక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు, మరో పక్క వైఎస్సార్‌ ఆసరా సంబరాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఆరో రోజు మంగళవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 90 మండలాల్లో కోలాటాలు, ర్యాలీలు, నృత్యాల మధ్య వైఎస్సార్‌ ఆసరా సంబరాలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. మహిళలు ఊరూరా సభలు పెట్టి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరుతో బ్యాంకుల్లో మహిళల పేరిట ఉండే అప్పును ప్రభుత్వమే భరిస్తూ, వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో వారికి డబ్బు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండో విడతకు సంబంధించి ఈ నెల 7వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రభుత్వం సంబంధిత మహిళల పొదుపు సంఘాల ఖాతాలకు డబ్బులు జమ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ. 6,439.52 కోట్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయగా.. బద్వేలు ఉప ఎన్నిక వల్ల ఎన్నికల కోడ్‌ కారణంగా ఆ జిల్లాలో పంపిణీ తాత్కాలికంగా వాయిదా పడింది. మిగిలిన 12 జిల్లాల పరిధిలోని 7.55 లక్షల సంఘాలకు సంబంధించి 74.81 లక్షల మంది మహిళలకు రూ.6,099 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. 

459 మండలాల్లో పంపిణీ పూర్తి 
ఆరు రోజులుగా 12 జిల్లాల పరిధిలోని 459 మండలాల్లో 4.74 లక్షల సంఘాలకు రూ.3,816.31 కోట్ల పంపిణీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఆయా మండలాల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళా లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమాలు జరిగా యి. గతంలో డ్వాక్రాసంఘాల రుణాలన్నీ మాఫీచేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మోసం చేసిన తీరు.. ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయం ప్రధానంగా ఈ కార్యక్రమంలో చర్చకు వస్తోంది. 

జోరు వర్షంలో కదంతొక్కిన మహిళలు
► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరులో జోరు వర్షాన్ని లెక్కచేయకుండా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. గూడూరులో వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. 
► అనంతపురం జిల్లా రొద్దంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, గుంటూరు జిల్లా రేపల్లెలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. 
► పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం, చాగల్లు మండలం చిక్కాల, కలవలపల్లి, ఊనగట్ల, నందిగంపాడు గ్రామాల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు.  
► తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో ఎంపీ వంగాగీత, రాజవొమ్మంగిలో అరకు ఎంపీ జీ.మాధవి స్థానిక ఎమ్మెల్యేలు చెక్కులుపంపిణీ చేశారు. 
► శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం గొల్లలవలసలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా జియ్యమ్మవలసలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.  
► విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంపీ డా.భీసెట్టి సత్యవతి, విశాఖ తూర్పు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెక్కులు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top