వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం | Waqf Amendment Act is unconstitutional says YV Subba Reddy | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం

Apr 4 2025 5:24 AM | Updated on Apr 4 2025 5:24 AM

Waqf Amendment Act is unconstitutional says YV Subba Reddy

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి

ఆర్టికల్‌ 13, 14, 25, 26లను వక్ఫ్‌ బిల్లు ఉల్లంఘిస్తోంది

ముస్లిం వర్గానికి అండగా ఉండేందుకే దీనిని వ్యతిరేకించాం

ఏపీలోని 50 లక్షల మంది ముస్లింలను టీడీపీ మోసం చేసింది

సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్‌ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 13, 14, 25, 26లను ఉల్లంఘించడం ద్వారా ముస్లింల ప్రాథమిక హక్కులను హరించి వేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం ఇవ్వడం అనేది ఆర్టికల్‌ 25, 26లను ఉల్లంఘించడమేనని చెప్పారు. ఈ నూతన బిల్లు ద్వారా వక్ఫ్‌ బోర్డు ఆర్థిక స్వాతంత్య్రాన్ని హరించి వేయడమే కాక, వార్షిక సహకారం 7 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల వక్ఫ్‌ బోర్డులను ఆర్థికంగా దెబ్బ తీస్తుందన్నారు. 

అందువల్ల వక్ఫ్‌ సవరణ బిల్లు–2025ను వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. దీనిని కేవలం వక్ఫ్‌ భూములకు సంబంధించిన అంశంగా మాత్రమే చూడరాదని, ఇది ముస్లింల మనోభావాలు, వారి ధార్మిక నమ్మకాలతో పాటు పలు అంశాలను దెబ్బతీసే అంశంగా చూడాలన్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్‌సీపీ సహా అనేక ముస్లిం సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. 

గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన వైఎస్సార్‌సీపీ తరఫున దానిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు సంబంధించి ఆలిండియా ముస్లిం లా బోర్డ్, జమైత్‌ ఉల్‌ ఉలేమా, జమైత్‌ ఇస్లాం ఎ హింద్‌ సహా అనేక మైనార్టీ సంస్థలు అనేక అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేశాయన్నారు.

వక్ఫ్‌ ఆస్తులను కాపాడడంలో టీడీపీ విఫలం
ముస్లింలకు రాజ్యాంగంలో కల్పించిన ఆస్తి హక్కుతో పాటు ధార్మిక అంశాల్లో వారి స్వేచ్ఛను ఈ బిల్లు హరించి వేస్తోందని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వారి ప్రయోజనా­లను, వక్ఫ్‌ ఆస్తులను కాపాడడంలో పూర్తిగా విఫలమైందని, మోస­ం చేసిందని విమర్శించారు. సంస్కరణ అనేది స్వాగతించే అంశమే అయినప్పటికీ మైనార్టీల రక్షణ అనేది చాలా ముఖ్య­మని చెప్పారు. 

దేశంలో 4 వేల సంవత్సరాల నుంచి ఉన్న వక్ఫ్‌ ప్రాథమిక భావనను ఈ నూతన బిల్లు పూర్తిగా నాశ­నం చేస్తోందన్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లు విషయంలో జా­యింట్‌ పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో సైతం వైఎస్సార్‌సీపీ తన అభ్యంతరాలను తెలియచేయడమే కాకుండా, రాష్ట్రంలోని ము­స్లి­ంలకు అండగా నిలబడిందని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. వక్ఫ్‌ బోర్డు పేరును మార్చడంతో పాటు బిల్లులోని సెక్షన్‌ 9, 14 ప్రకారం ముస్లిమేతరులను బోర్డులోకి చేర్చ­డం పూర్తిగా అసంబద్ధమని అన్నారు. ఈ బిల్లు వక్ఫ్‌ బోర్డు ఆర్థిక స్వాతంత్య్రాన్ని పూర్తిగా దెబ్బ తీస్తుందని చెప్పారు.

వక్ఫ్‌ బోర్డులో ఇతర మతాల వాళ్లా?
మాజీ ఎమ్మెల్యే మహమ్మద్‌ అబ్ధుల్‌ హఫీజ్‌ఖాన్‌ ఆగ్రహం
కర్నూలు (టౌన్‌): వక్ఫ్‌ సవరణ బిల్లు విషయంలో ముస్లిం సమాజాన్ని చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, ఇది చరిత్రలో మచ్చగా నిలిచి పోతుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం ల  విషయంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకత ఈ బిల్లు విషయంలో మరోసారి బయట పడిందన్నారు.  

ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, జమాతే ఉలేమా, జమాతే ఇస్లామిక్‌ హింద్, సునతుల్‌ జమాతే వంటి సంస్థలు ఈ బిల్లును వ్యతిరేకించాయని, దీని వల్ల మైనార్టీలు నష్టపోతారన్నారు. వక్ఫ్‌ భూములపై కలెక్టర్‌కు అధికారం ఇస్తే ప్రభుత్వం చెప్పినట్లు నిర్ణయం తీసుకుంటారన్నారు. దీని వల్ల మైనా­ర్టీకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.  వక్ఫ్‌బోర్డులో మాత్రం ఇతర మతాల వారిని పెట్టి నామినేటేడ్‌ పదవులను కేటాయించాలని చూస్తుండటం దారుణమని నిప్పులు చెరిగారు.

మైనార్టీలకు చంద్రబాబు ద్రోహం
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ధ్వజం
కడప కార్పొరేషన్‌: వక్ఫ్‌ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణ­మని, చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో ముస్లింలను వాడుకుని, ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాయని చెప్పారు.

మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ రెండు పార్టీలు వాడుకున్నాయని ధ్వజమెత్తారు.  బిల్లును వ్యతిరేకించాలని ఎందరో ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు విన్నవించగా, అండగా ఉంటానని హామీ ఇచ్చారని చెప్పారు. తీరా ఆ బిల్లుకు మద్దతు పలికి మైనారిటీలను తీవ్రంగా వంచించారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయ్యాక మైనారిటీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement