వహ్వా.. వలంటీర్‌!

Volunteer Balaji Helping Hand To Poor People In Covid Times - Sakshi

101 రోజులుగా పేదలకు సాయం

5 వేల గౌరవ వేతనం, సేవామిత్ర పురస్కార మొత్తం కూడా సేవకే..

పుత్తూరు (చిత్తూరుజిల్లా) : కరోనా కష్టకాలంలో నిరుపేదలు, యాచకులను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలుస్తున్నాడు సాధారణ కూలీ కుటుంబానికి చెందిన ఓ వలంటీర్‌. తండ్రిని పోగొట్టుకుని పేదరికపు కష్టాలను స్వయంగా చవిచూసిన ఈ యువకుడు పదిమందికి ఉపయోగపడాలన్న తన లక్ష్యసాధనలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ యువకుడి సేవాగాథ వివరాలివీ.. పుత్తూరు మండలం తడుకు పంచాయతీ వీఎస్‌ఎస్‌ పురం గ్రామానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమారుడు బాలాజీ. తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. ఆ తర్వాత ఉద్యోగ వేటలో ఉన్న బాలాజీ గ్రామ వలంటీరుగా ఎంపికయ్యాడు. గ్రామస్థులకు ‘సచివాలయ’ సేవలందిస్తూ అధికారుల మన్ననలు పొందుతున్నాడు. మరోవైపు.. ఎలక్ట్రీషియన్‌గా కూడా పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో.. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండడంతో నిరుపేదలు, యాచకులు పడుతున్న బాధలను గుర్తించాడు. వీరికి చేయూతనివ్వాలన్న తలంపుతో ‘సేవా మిత్ర రూరల్‌ ఫౌండేషన్‌’ పేరుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. రోజూ 30 మందికి భోజనాలు, టిఫిన్‌ అందిస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ యజ్ఞం శనివారం 101వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామంలోని గిరిజన కుటుంబాలకు, వీఎస్‌ఎస్‌ పురంలోని గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశాడు. వలంటీరుగా తనకు వచ్చే రూ.5 వేల గౌరవ వేతనంతోపాటు సేవామిత్ర పురస్కారం ద్వారా అందించిన రూ.10 వేలు, ఎలక్ట్రికల్‌ పనుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని నిరుపేదల సేవకు ఖర్చు చేస్తున్నాడు.  

సేవలోనే సంతోషం..
పేదరికం అంటే ఏమిటో చూశాను. కరోనా కాలంలో కొందరు ఆకలితో రోడ్డు పక్కనే చనిపోయారు. అందుకే నాకు వీలైనంత వరకు సాయం చేయాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాను. మూడు నెలలుగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. వలంటీరుగా వచ్చే సంపాదన పూర్తిగా పేదలకే ఖర్చు చేస్తున్నాను. 
– బాలాజీ, వలంటీరు, వీఎస్‌ఎస్‌ పురం, పుత్తూరు మండలం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top