
అమెరికాకు పెరుగుతున్న ఎగుమతులు
భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో అమెరికా
త్వరలో 2వ స్థానంలోకి..
ప్రారంభంలో ఎగుమతులు 1.45 టన్నులు
ఐదేళ్లలో 2,137 టన్నులకు పెరుగుదల
సాక్షి, అమరావతి: అమెరికాకు భారత్ మామిడి ఎగుమతుల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), నేపాల్, అమెరికా, కువైట్, ఒమన్, ఖతార్, కెనడా ఉన్నాయి. ఐదేళ్ల క్రితం భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో అట్టడుగునున్న అమెరికా, అనూహ్యంగా ప్రస్తుతం నాలుగో స్థానానికి ఎగబాకింది. సమీప భవిష్యత్‌లో రెండో స్థానానికి మారుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమెరికాకు రూ.100 కోట్లకు చేరిన మామిడి ఎగుమతులు
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మెక్సికో, నెదర్లాండ్స్, బ్రెజిల్ తర్వాత మామిడి ఎగుమతుల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా మామిడి పండ్లు ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటిస్థానంలో ఉన్న మెక్సికో మొన్నటి వరకు అమెరికా మామిడి మార్కెట్‌ను శాసించింది. మెక్సికో తర్వాత బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ వంటి దేశాలు అమెరికాకు ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నాయి. అలాంటిది నేడు భారతదేశం అమెరికాకు ప్రధాన మామిడి ఎగుమతిదారుగా అవతరిస్తోంది.
2020– 21లో తొలిసారి అమెరికా విమానమెక్కిన మన మామిడి పండ్లు, గడిచిన ఐదేళ్లలో అగ్రరాజ్యానికి ప్రీతిపాత్రమైపోయాయి. 2020–21లో కేవలం రూ.లక్ష విలువైన 1.45 టన్నుల మామిడి ఎగుమతి జరగ్గా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో తొలి పది నెలల్లోనే (2024 ఏప్రిల్–2025 జనవరి) దాదాపు రూ.100 కోట్ల విలువైన 2,137 టన్నుల మామిడి పండ్లు అగ్రరాజ్యానికి ఎగుమతయ్యాయి.
సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే..
ఇక విదేశాలకు ఎగుమతయ్యే మామిడిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయి. అయితే ఏపీలో సాగయ్యే బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, హిమాయుద్దీన్ వంటి రకాల్లో ఎక్కువగా బంగినపల్లి, తోతాపురి రకాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.
విదేశాలకు ఎగుమతి అయ్యే మామిడిలో 60 శాతానికి పైగా ఏపీకి చెందినవే. అయితే ఏపీ రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడిని ముంబై మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముంబై నుంచి ఎగుమతి అయ్యే మామిడిలో దాదాపు 80 శాతం ఏపీకి చెందినవేనని చెబుతున్నారు. ఏటా సగటున 2.5 లక్షల టన్నులకుపైగా మామిడి గుజ్జు విదేశాలకు ఎగుమతి అవుతోంది.
అమెరికాకు కొత్త రుచి.. ‘కేసర్ ’
భారతదేశంలో సాగయ్యే మామిడి రకాల్లో అల్ఫోన్సో, కేసర్, బంగినపల్లి, తోతాపురి, చౌసా, దసేరి ప్రధానమైనవి. అయితే, అమెరికాకు ఎగుమతులలో కేసర్, అల్ఫోన్సో రకాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2024లో అమెరికాకు ఎగుమతైన మామిడిలో ‘కేసర్’ది అగ్రస్థానం. ఆ తర్వాత జాబితాలో ‘అల్ఫోన్సో’ ఉంది. అంతకుముందు అమెరికా వినియోగదారులకు ఇష్టమైన అల్ఫోన్సోను కేసర్ అధిగమించడం గమనార్హం.
కేసర్ మామిడి రకం గుజరాత్‌లోని జునాగఢ్, అమరేలీ జిల్లాలలో ప్రధానంగా సాగవుతోంది. ఇది 1930ల్లో గుజరాత్‌లోని ఒక రైతు ద్వారా అభివృద్ధి చేసిన రకం ఇవి అమితమైన తీపి, రుచి, రసవంతమైన గుజ్జు, దీర్ఘకాల షెల్ఫ్ లైఫ్ కలిగి ఉండడంతో పాటు అల్ఫోన్సో కంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.