Visakhapatnam: విశ్వ విశాఖ.. మరోసారి కీర్తి పతాకం ఎగరేసింది

Visakhapatnam bags Fourth rank in Swachh Survekshan 2022 - Sakshi

గత ర్యాంకును అధిగమించి  టాప్‌–5లో నిలిచిన జీవీఎంసీ 

సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌లో టాప్‌ సిటీ  

గార్బేజ్‌ ఫ్రీ సిటీలో 5స్టార్‌ రేటింగ్‌

సాక్షి, డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): విశ్వ విశాఖ..మరోసారి కీర్తి పతాక ఎగరేసింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌–2022లో నాల్గో ర్యాంకు సాధించి.. గత ర్యాంకును అధిగమించింది. 2018–19లో 23వ ర్యాంకుకు పడిపోయిన విశాఖ.. 2019–20లో 9వ స్థానానికి ఎగబాకింది. 2020–21లో అదే స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది దేశంలో టాప్‌–5లో నిలిచి 4వ ర్యాంకు సాధించింది. పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ, రవాణా వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ప్లాస్టిక్‌ నిషేధం తదితర అంశాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకును ప్రకటించింది. సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌లో కూడా టాప్‌ సిటీగా జీవీఎంసీ గుర్తింపు పొందడం విశేషం. గార్బేజ్‌ ఫ్రీ సిటీలో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది.  

దేశవ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి, పర్యాటక ప్రాంతంగా బీచ్‌ క్లీన్, పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ నిషేధం. మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులకు నగరాలను ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది ర్యాంకులను శనివారం ఢిల్లీలో ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో 2021–22కి గానూ విశాఖ మహా నగరం మొదటి 5 నగరాల జాబితాలో నిలిచింది. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి సమక్షంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నగరాలకు సంబంధించి ప్రకటించిన ర్యాంకుల్లో ఇండోర్‌కు మొదటిస్థానం దక్కగా.. జీవీఎంసీకి నాల్గో ర్యాంకు వచ్చింది.  


అవార్డులతో మేయర్‌ హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీ లక్ష్మీశ, అదనపు కమిషనర్‌ సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి 

జీవీఎంసీకి గతంలో 9.. ఇప్పుడు 4 
జీవీఎంసీకి నాల్గో ర్యాంకు రావడంపై విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 9వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఢిల్లీలోని తలక్‌తోరా ఇండోర్‌ స్టేడియంలో శనివారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు, గత కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, అదనపు కమిషనర్‌ డాక్టర్‌ సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి తదితరులు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.  

జీవీఎంసీకి వచ్చిన మార్కులివీ..  
మొత్తం 7,500 మార్కులకు గానూ జీవీఎంసీకి 6,701 మార్కులు వచ్చాయి. పార్ట్‌–1లో స్వచ్ఛత లీగ్‌ ప్రోగ్రెసీవ్‌కు సంబంధించి 3,000 మార్కులకు 2,536, పార్ట్‌–2లో గార్బేజ్‌ ఫ్రీ సిటీకి సంబంధించి 1,250 మార్కులకు 1,050, పార్ట్‌–2బిలో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంలో వెయ్యికి వెయ్యి మార్కులు, పార్ట్‌–3లో సిటిజన్‌ వాయిస్‌కు సంబంధించి 2,250కి గానూ 2,115 మార్కులు వచ్చాయి.  

సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌లో బెస్ట్‌ సిటీ  
స్వచ్ఛ సర్వేక్షణ్‌–2022లో నగరాన్ని ఉన్నతంగా నిలపడంలో నగర పౌరుల భాగస్వామ్యం ఎంతో ఉంది. సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ విషయంలో విశాఖను నంబర్‌వన్‌గా నిలబెట్టారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు స్వచ్ఛతా బృందం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వే నిర్వహించారు. వెబ్‌సైట్‌ ద్వారా, గూగుల్‌ పేలో స్వచ్ఛభారత్‌ యాప్‌ ద్వారా సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌లో ఏ నగరం ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఏడు ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తారో ఆ నగరానికి గరిష్ట మార్కులు కేటాయిస్తారు. ఈ విభాగంలో వైజాగ్‌కు బెస్ట్‌ సిటీ అవార్డు వరించింది. 10 నుంచి 40 లక్షల జనాభా ఉన్న నగరాలను ఓ విభాగంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విభాగంలో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌లో బెస్ట్‌ సిటీగా ఎంపికైంది.    

ప్రజల భాగస్వామ్యంతో 4వ ర్యాంకు 
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీ 4వ స్థానం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. అవార్డు సాధించడంలో జీవీఎంసీ యంత్రాంగంతో పాటు స్వచ్ఛ భారత్‌ అంబాసిడర్లు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, సెలబ్రిటీలు, ఆర్‌డబ్ల్యూఎస్, వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు, నగర పౌరుల కృషి ఎంతో ఉంది. ఇదే స్ఫూర్తితో నగరాన్ని మరింత సుందరంగా ఉంచేందుకు అనునిత్యం కృషి చేస్తాం.

పోటీతత్వం ఉంటేనే నగరాలు మరింత పరిశుభ్రంగా ఉంటాయి. రోజురోజుకూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న విశాఖ నగరం ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలుస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రజలందరి భాగస్వామ్యంతో వచ్చే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి ర్యాంకు సాధనే లక్ష్యంగా పనిచేస్తాం.  
– గొలగాని హరి వెంకటకుమారి, మేయర్‌ 

అవార్డు మరింత బాధ్యత పెంచింది 
విశాఖ మహానగరం 4వ ర్యాంకు సాధించి టాప్‌–5లో నిలవడం గర్వంగా ఉంది. అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి. ఈ అవార్డు పొందడం వెనుక మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, గత కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, పాలకమండలి, అధికారులు, సిబ్బందితో పాటు నగర పౌరులు, ఆర్‌డబ్ల్యూఎస్, నేవల్, పోలీస్, విద్యాసంస్థలు, ఎన్జీవోస్‌ కృషి ఉంది. 2023లో టాప్‌–1 స్థానాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమిస్తాం. కేవలం ర్యాంకు కోసమే కాకుండా.. ప్రజలకు సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవనం అందించడంతో పాటు క్లీన్‌ సిటీగా నిత్యం ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం.          
– పి.రాజాబాబు, జీవీఎంసీ కమిషనర్‌  

శత శాతం క్లీన్‌ సిటీ విశాఖ  
కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో నియమ నిబంధనలతో పనులు పూర్తి చేస్తున్నాం. పారిశుధ్యం విషయంలో రాజీ పడటం లేదు. అందుకే గత ర్యాంకును అధిగమించి టాప్‌–5లో నిలిచాం. వచ్చే ఏడాదికి మరింత మెరుగు పడేందుకు ప్రయత్నిస్తాం. పారిశుధ్య కార్మికులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఏఎంహెచ్‌వోలు, జెడ్సీలు, నివాసిత సంక్షేమ సంఘాలు, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్లు, ఎన్జీవోల సమష్టి కృషితో ఈ అవార్డును సొంతం చేసుకున్నందుకు గర్వంగా ఉంది. 
– డా.కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి

చెత్త రహిత నగరాల్లో 5 స్టార్‌ రేటింగ్‌ 
చెత్తరహిత నగరాల జాబితాలో గతేడాది 3స్టార్‌ రేటింగ్‌ సాధించిన జీవీఎంసీ ఈ ఏడాది 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. 98 వార్డుల్లోనూ తడి పొడి చెత్త విభజన చేసి, ఎరువును తయారు చేయడం వంటి అంశాలన్నీ విశాఖ నగరాన్ని 5 స్టార్‌ రేటింగ్‌కు తీసుకెళ్లాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top