బహిరంగ ప్రదేశాల్లో చవితి వేడుకలకు అనుమతిలేదు..

Vinayaka Chavithi To be Celebrated Indoors in Vijayawada - Sakshi

సాక్షి,గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను ఈ ఏడాది కూడా నిరాడంబరంగా నిర్వహించుకోవాలని కలెక్టర్‌ జె.నివాస్‌ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై విజయవాడ, నూజివీడు, మచిలీ పట్నం, గుడివాడ రెవెన్యూ డివిజన్ల సబ్‌ కలెక్టర్లు, ఆర్డీఓలకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల పదో తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని ఇంటిలో మాత్రమే పూజలకు పరిమితం కావాలని భక్తులను కోరారు.

చవితి వేడుకల్లో భాగంగా బహిరంగ ప్రదేశాలు, కూడళ్లలో గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని, నిమజ్జన కార్యక్రమాలు జరపొద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. వినాయక చవితి నిర్వహణ కమిటీలు పూర్తిస్థాయిలో జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిలో వినాయక చవితి నిర్వహణ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులను ఆహ్వానించి, వారితో సమావేశాలు నిర్వహించి, వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ నివాస్‌ ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రజలు గుమిగూడకుండా ఉండడమే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు.

చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top