
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించే తలనీలాలకు రికార్డు ధర పలికింది.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించే తలనీలాలకు రికార్డు ధర పలికింది. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఏడాదిపాటు తలనీలాలు సేకరించుకునేందుకు రూ.7,15,99,999 చెల్లిస్తామని తమిళనాడుకు చెందిన కేఎం ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. గత ఏడాది రూ.5.67 కోట్లు పలికిన టెండర్ ఈ దఫా రూ.7.16 కోట్లకు చేరింది. దీంతో నిరుటికంటే రూ.1.49 కోట్ల మేర ఆలయానికి అధికంగా ఆదాయం సమకూరింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన తలనీలాలను పోగుచేసుకునే హక్కుకోసం ఆలయ అధికారులు టెండర్ ప్రక్రియను నిర్వహించారు.
బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ–టెండర్ విధానాల ద్వారా టెండర్లు ఆహ్వానించారు. దుర్గగుడి పరిపాలన భవనంలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మొత్తం పదిమంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ టెండర్ దేవదాయశాఖ కమిషనర్ ఆమోదం పొందిన 72 గంటల్లోనే కేఎం ఇండస్ట్రీస్ ఆ మొత్తాన్ని ఆలయానికి చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ ప్రక్రియను దేవస్థానం ఏఈవో వెంకటరెడ్డి, పాలకమండలి సభ్యులు బాల, సుజాత పర్యవేక్షించారు. (చదవండి: విజయవాడలో అరుదైన పిల్లి హల్‌చల్.. ఎలా వచ్చింది?)