తప్పంతా రమేష్‌ ఆస్పత్రిదే

Vijayawada Fifth Additional Metropolitan Sessions Court Orders On Ramesh Hospital - Sakshi

ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి.. నిందితులకు బెయిల్‌ ఇస్తే రికార్డులను తారుమారు చేయొచ్చు

కాబట్టి రమేష్‌ ఆస్పత్రి సీవోవో, జీఎం తదితరుల బెయిల్‌ పిటిషన్లను కొట్టేస్తున్నాం 

విజయవాడ ఐదో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులు 

స్వర్ణ ప్యాలెస్‌కు అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయని అనుకుని ఆ హోటల్‌తో ఒప్పందం చేసుకున్నామన్న రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం వాదనను తోసిపుచ్చుతున్నాం. లీజుకు తీసుకునేటప్పుడు సౌకర్యాలు గురించి పట్టించుకోకపోవడం, హోటల్‌లో ఉన్న లోపాలను ప్రమాదం జరిగిన ఆగస్టు 9 నాటికి కూడా సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం పూర్తిగా నిర్లక్ష్యం కిందకే వస్తుంది.        – కోర్టు వ్యాఖ్య

సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్‌: విజయవాడ హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పదిమంది కోవిడ్‌ రోగులు మరణించిన ఘటనతో తమకేమీ సంబంధం లేదన్న రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని విజయవాడ ఐదో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా ఆస్పత్రి యాజమాన్యానిదేనని స్పష్టం చేసింది. ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయంది. రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం తన బాధ్యత నుంచి ఏ మాత్రం తప్పించుకోలేదంది.  

► కోవిడ్‌ సెంటర్‌గా స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను వాడుకుంటామని జిల్లా వైద్యాధికారి (డీఎంవో)కి లేఖ రాసింది.. ఆస్పత్రేనని గుర్తు చేసింది.  
► హోటల్‌తో ఒప్పందం చేసుకునేటప్పుడే దానికి అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత రమేష్‌ ఆస్పత్రిదేనని తేల్చిచెప్పింది.  
► ఈ దశలో నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలు, రికార్డులను తారుమారు చేయడంతోపాటు దర్యాప్తులో జోక్యం చేసుకుంటారంది.  
► స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రమేష్‌ ఆస్పత్రి సీవోవో డాక్టర్‌ కొడాలి రాజగోపాల్‌రావు, జీఎం డాక్టర్‌ కూరపాటి సుదర్శన్, పీఆర్‌వో పి.వెంకటేష్‌లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.  
► ఈ మేరకు విజయవాడ ఐదో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

కోర్టు ఏమందంటే.. 
► స్వర్ణ ప్యాలెస్‌కు అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయని అనుకుని ఆ హోటల్‌తో ఒప్పందం చేసుకున్నామన్న రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం వాదనను తోసిపుచ్చుతున్నాం.  
► ఆ హోటల్‌లో అగ్నిమాపక, ఫైర్‌ అలారమ్‌ పరికరాలు కూడా లేవు.  
► కోవిడ్‌ కేంద్రం రోజువారీ నిర్వహణ చూసుకునే రమేష్‌ ఆస్పత్రికి ఈ పరికరాలు లేవన్న విషయం స్పష్టంగా తెలిసే ఉంటుంది.  
► లీజుకు తీసుకునేటప్పుడు సౌకర్యాలు గురించి పట్టించుకోకపోవడం, హోటల్‌లో ఉన్న లోపాలను ప్రమాదం జరిగిన ఆగస్టు 9 నాటికి కూడా సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం పూర్తిగా నిర్లక్ష్యం కిందకే వస్తుంది.  
► అగ్నిప్రమాదం జరిగితే ప్రాణహాని ఉంటుందన్న విషయం కూడా ఆస్పత్రి యాజమాన్యానికి తెలుసు. ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి.
► అన్నీ తెలిసే స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్‌ కేంద్రాన్ని తెరిచారు.  
► ఈ విషయంలో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి ఐపీసీ సెక్షన్‌ 304 పార్ట్‌ 2 కింద కేసు నమోదు చేయడం సబబే. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కీలక నిందితులను అరెస్ట్‌ చేయాల్సి ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top