అందరి ముఖాల్లో చిరునవ్వే సీఎం ఆశయం | Sakshi
Sakshi News home page

అందరి ముఖాల్లో చిరునవ్వే సీఎం ఆశయం

Published Mon, Apr 18 2022 4:21 AM

Vijayasaireddy response to mega job mela - Sakshi

తిరుపతి ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన మెగా జాబ్‌మేళా రెండవ రోజు ఆదివారం కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. వారి కుటుంబానికి ఆధారం కల్పించాలి. సామాజికంగా, ఆర్థికంగా ఆ కుటుంబం ఎదగాలి. ఇదీ సీఎం ఆశయం. ఆయన సంకల్పంతోనే ఈ జాబ్‌మేళాల నిర్వహణ.    వాస్తవానికి ఈ కార్యక్రమం గురించి ఆలోచించినప్పుడు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ జాబ్‌మేళాలో అత్యధిక వేతనం రూ.77 వేలతో ఆఫర్‌ లెటర్‌ ఇచ్చారు’ అని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
వివిధ కంపెనీల హెచ్‌ఆర్‌ హెడ్స్‌ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం 

7,537 మందికి ఉద్యోగాలు
► ఇవాళ్టి జాబ్‌మేళాకు కూడా ఊహించని విధంగా ఉద్యోగార్థులు వచ్చారు. పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్‌ అర్హతలతో 4,774 మంది రాగా, వారిలో 1,792 మందికి ఎంపికయ్యారు. బీఏ, బికామ్, బీఎస్సీ, బీబీఏ అర్హతలతో 2,732 మంది హాజరు కాగా, 341 మంది సెలెక్ట్‌ అయ్యారు. 
► బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ అర్హతలతో 2,370 ఉద్యోగార్థులు హాజరు కాగా, 621 మంది ఎంపికయ్యారు. ఇవాళ 9,876 మంది హాజరు కాగా, వారిలో మొత్తంగా 2,753 మంది సెలెక్ట్‌ అయ్యారు. ఈ రెండు రోజుల్లో దాదాపు 25,626 మంది హాజరు కాగా, మొత్తం 7,537 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ జాబ్‌మేళాకు 147 జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. 
► రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పార్టీ అనుబంధ విభాగాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తాం. విపక్షాల విమర్శ సహేతుకంగా ఉండాలి. కేవలం విమర్శ కోసం విమర్శలు చేయడం సరి కాదు. యువత కోసం ఈ పని చేస్తున్నాం. మేం ఏం చేసినా రాష్ట్రం, ప్రజల కోసమే చేస్తాం. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం.
► ఉద్యోగం రాని వారు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించాలి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమాపే వరకు జాబ్‌మేళా ప్రక్రియ కొనసాగుతుంది. విశాఖపట్నం, గుంటూరులో జరిగే జాబ్‌మేళాలో ప్రత్యేక ప్రతిభావంతులు, 30 ఏళ్లు పైబడిన వారికి ఉద్యోగాలు వచ్చేలా దృష్టి సారిస్తాం. 
► జాబ్‌మేళా సక్సెస్‌కు కారకులైన వివిధ కంపెనీల యాజమాన్యాలు, ఎస్వీ యూనివర్సిటీ, జిల్లా యంత్రాంగం, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి డెప్యూటీ మేయర్‌ భూమన అభినయ రెడ్డి, వలంటీర్లకు కృతజ్ఞతలు. 
► ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సోషల్‌ మీడియా విభాగం ఇన్‌చార్జ్‌ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.  
జాబ్‌మేళాకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేస్తున్న దృశ్యం 

Advertisement
Advertisement