ZP Chairman Srinivasa Rao: మహానాడు కాదు.. ఏడుపునాడు

Vijayanagaram ZP Chairman Srinivasa Rao Criticized TDP Party - Sakshi

పార్వతీపురం టౌన్‌: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తు న్నది మహానాడు కాదు.. ఏడుపు నాడు అని వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడు పేరుతో ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రెండు రోజులు ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు ఆద్యంతం సీఎంను, ఆయన కుటుంబా న్ని దూషించడమే లక్ష్యంగా సాగిందన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, బీసీలకు కల్పించిన ప్రయోజనాలను, భవిష్యత్తులో ఏమి చేస్తారో చెప్పకుండా ప్రభుత్వంపై బురదజల్లడ మే పనిగా పెట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకు ఎవరూ చేయని విధంగా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిదని పేర్కొన్నారు. ఆయా వర్గాల్లోని లబ్ధిదారులకు 95 శాతం మేర సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వివరించారు.

రాష్ట్రంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ఆయా వర్గాల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి భయం పట్టుకుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మానసిక స్థైర్యం కల్పించేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. అదే ఆనాడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నవరత్నాల కార్యక్రమం కింద ఏమీ చేస్తామో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం చేసి చూపించారన్నారు. తమ నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: సమ్మర్‌ స్టడీస్‌.. ఇంట్లోనే చదవండి ఇలా!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top