విశాఖలో డ్రోన్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

Vijaya Sai Reddy Drone research center should be set up in Visakhapatnam - Sakshi

రాజ్యసభలో కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయంతోపాటు అనేక రంగాల్లో డ్రోన్‌ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్‌ టెక్నాలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు విశాఖపట్నంలో జాతీయస్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం రాజ్యసభలో జీరో అవర్‌లో మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఆవిష్కృతమైన అత్యంత కీలక సాంకేతిక పరిజ్ఞానాల్లో డ్రోన్‌ టెక్నాలజీ ఒకటని చెప్పారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, రక్షణ, రవాణా తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిందన్నారు.  

డ్రోన్‌ టెక్నాలజీ సాయంతో రైతులు తక్కువ శ్రమతో పంట దిగుబడులను 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 65 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడ్డారని, వ్యవసాయ రంగంలో కొత్త పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాగులో ప్రయోగాలకు రాష్ట్ర రైతులు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు.  ఆహార ధాన్యాలతోపాటు పండ్లు, కూరగాయల సాగులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని, రైతులు క్రమేణ ఆయిల్‌పామ్‌ సాగువైపునకు కూడా మళ్లుతున్నారని చెప్పారు.  

పోలవరం చెల్లింపుల్లో జాప్యం లేదు
పోలవరం ప్రాజెక్టు పనుల నిమిత్తం ఖర్చుచేసిన సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు చెప్పారు. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.15,970.53 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. ఈ మొత్తంలో ఆమోదయోగ్యమైనవిగా గుర్తించిన బిల్లులకు రూ.13,226 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు పనుల బిల్లుల్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తనిఖీ చేసి వాటి చెల్లింపులకు సిఫార్సు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు ఆర్థికశాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని 2016 సెప్టెంబర్‌ 30న  ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఆఫీసు మెమొరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ కింద అయిన ఖర్చు మాత్రమే భర్తీచేయాల్సి ఉందన్నారు. 

ఇథనాల్‌ స్టాకు పెంపు నిరంతర ప్రక్రియ
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపాల్సిన అవసరం దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇథనాల్‌ నిల్వల సామర్థ్యం పెంపు అనేది నిరంతర ప్రక్రియ అని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2020–21లో దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీలు) పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ కలిపినట్లు తెలిపారు.  

2024 మార్చికల్లా కుళాయి కనెక్షన్లు 
ఏపీలోని 95.69 లక్షల గ్రామీణ కుటుంబాల్లో 64.07 లక్షల (66.96 శాతం) కుటుంబాలకు ఈ నెల 13వ తేదీనాటికి కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీరు అందించినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ తెలిపారు.వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

మూడు ప్రాంతాల నుంచి ఉడాన్‌ సేవలు 
ఉడాన్‌ విమానాల సేవల నిమిత్తం ఏపీలోని కడప, కర్నూలుతోపాటు ప్రకాశం బ్యారేజీలోని వాటర్‌ఏరోడ్రోమ్‌ గుర్తించామని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వి.కె.సింగ్‌ తెలిపారు. కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి ఇప్పటికే సేవలు ప్రారంభమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు జవాబిచ్చారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నిర్వహణపై సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తయిందని తెలిపారు. 

ఐదేళ్లలో 2,943.53 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా 
రైల్వే ఐదేళ్లలో 2,943.53 మిలియన్‌ టన్నుల బొగ్గును రవాణా చేసిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.  వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. 

పట్టణాలను స్మార్ట్‌సిటీ మిషన్‌లో చేర్చే ప్రతిపాదన లేదు 
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలుసహా వేటినీ స్మార్ట్‌సిటీ మిషన్‌లో చేర్చే ప్రతిపాదన లేదని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిషోర్‌ తెలిపారు.  వైస్సార్‌సీపీ ఎంపీ బీద మస్తానరావు ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

పైపులైను పనుల గడువు పొడిగించాలని కోరిన ఐఎంసీ
కాకినాడ–విజయవాడ–నెల్లూరు పైపులైను పనులు 2021 మార్చికల్లా పూర్తిచేయాల్సి ఉందని, కానీ గడువును 2024 మార్చి వరకు పొడిగించాలని ఇండియన్‌ మొలాసెస్‌ సంస్థ (ఐఎంసీ) కోరిందని కేంద్ర పెట్రోలియం సహజవనరులశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి.. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు 2,160.47 ఎకరాలు సేకరించిన ఏపీ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ పద్ధతిలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం అభివృద్ధిని చేపట్టిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వి.కె.సింగ్‌ తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి సుమారు 2,203 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2,160.47 ఎకరాల భూమి సేకరించిందని చెప్పారు.

గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ పాలసీ–2008 ప్రకారం.. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ అమలు బాధ్యత సంబంధిత విమానాశ్రయ డెవలపర్‌ లేదా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని తెలిపారు. విమానాశ్రయ ప్రాజెక్ట్‌ల పూర్తి అనేది భూసేకరణ, తప్పనిసరి అనుమతుల లభ్యత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని టీడీపీ సభ్యుడు రవీంద్రకుమార్‌ ప్రశ్నకు జవాబిచ్చారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top