
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకాశం జిల్లాకు చెందిన చిట్యాల విజయ భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గీతం విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విజయ భాస్కర్ రెడ్డి బెంగళూరులో 2010వ సంవత్సరంలో వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం స్థాపించారు. ఈ ఫోరం ఆధ్వర్యంలో బెంగళూరు, పూణే నగరాల్లో ఐటి ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పలు సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించారు.
ప్రతిష్టాత్మక పులివెందుల, కడప ఉపఎన్నికల్లో ఫోరం టీం సభ్యులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ పెట్టక ముందు వైఎస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రలో చురుకుగా పాల్గొన్నారు. అప్పటి నుంచి తాను తన ఉద్యోగ, వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ తాను ఎంతగానో ఆదర్శంగా తీసుకుని ప్రేరణ పొందిన నాయకుడు వైఎస్ జగన్‌తో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన సేవలను అందిస్తూ వస్తున్నారు.
అలానే ఇటీవల తన తాత పేరు మీద ఒక ట్రస్ట్ నెలకొల్పి పలువురు బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. తన మండల పరిధిలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. తెలంగాణా రాష్ట్రంలో తాను ఎన్నో ఏళ్లుగా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు గాను ఇటీవల ప్రతిష్టాత్మక సౌత్ ఇండియా సిఎస్ఆర్ అవార్డు అందుకున్నారు. చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషి, వృత్తిపరమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి చెందిన కీలకమైన రాష్ట్ర ఐటి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు.
ఈ సందర్భంగా చిట్యాల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎంతగానో అభిమానించే పార్టీ అధినాయకులు జగన్ అన్న నాయకత్వంలో కీలకంగా పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం అని తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను రాష్ట్ర విభాగ అధ్యక్షులు, అన్ని స్థాయిలలోని కమిటీ సభ్యులతో కలిసి సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ముంబయి, పూణే లాంటి వివిధ నగరాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐటి, ఇతర నిపుణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యున్నతికి తన వంతుగా శక్తి వంచనలేకుండా అంకిత భావంతో కృషి చేస్తానని తెలియజేశారు. వైఎస్సార్ స్ఫూర్తిని, ఆశయాలను అనుసరిస్తూ ఈ బృహత్తర బాధ్యతలను అప్పగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.