AP: మనసేం బాలేదు.. ‘టెలీ మానస్‌’కు పెరుగుతున్న కాల్స్‌!

Victims Are Calling Tele Manas With Mental Stress In AP - Sakshi

మానసిక శక్తిని దెబ్బతీసిన కరోనా

ర్యాంక్‌లు, మార్కుల వేటలో విద్యార్థులు విలవిల 

‘టెలీ మానస్‌’కు కాల్‌ చేస్తున్న బాధితులు 

‘కరోనాతో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఆన్‌లైన్‌ క్లాస్‌లకు అటెండ్‌ అయ్యాను. అప్పట్లో సరిగా చదువుపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ క్లాస్‌లు నడుస్తున్నాయి. రోజూ కాలేజీకి వెళుతున్నాను. కానీ టీచర్‌ చెప్పేది అర్థం కావడం లేదు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయి. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు’
– ఓ ఇంటర్‌ విద్యార్థి

‘ఓ వైపు ఆఫీస్, మరోవైపు ఇల్లు.. ఇలా రెండు చోట్లా సమస్యలు వేధిస్తున్నాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత కోల్పోతున్నాను. ఒంటరిగా జీవించాలనే భావన పెరుగుతోంది’
– ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి

సాక్షి, అమరావతి: వివిధ మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు వైద్య శాఖ ఏర్పాటు చేసిన ‘టెలీ మానస్‌’ కాల్‌ సెంటర్‌ను సంప్రదిస్తున్నారు. సమస్యలను వివరంగా తెలుసుకుంటున్న కాల్‌ సెంటర్‌లోని కౌన్సి­లర్లు బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నారు. అవసరం మేరకు దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్యులకు రిఫర్‌ చేసి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. 

కరోనా మహమ్మారి, వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌ డౌన్‌ చాలా మందిలో మానసిక శక్తిని దెబ్బతీసింది. దీనికి తోడు వివాహ బంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యా, ఉద్యోగం, అనారోగ్యం ఇతరత్రా కారణాలతో మానసిక సమస్యలతో సతమత­మయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దేశంలో సుమారు 15 కోట్ల మంది మానసిక అనారోగ్య సమ­స్యలతో బాధపడుతున్నారని గతేడాది నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌(ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌) సర్వే వెల్లడించింది.

డిప్రెషన్‌కు లోనై..  
రాష్ట్రంలో మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం, సలహాలు, సూచనలివ్వడం కోసం గతేడాది అక్టోబర్‌లో వైద్య శాఖ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించింది. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాల్‌ సెంటర్‌ ఉంది. ఈ కాల్‌ సెంటర్‌కు ఇప్పటి వరకూ వివిధ సమస్యలతో 2,452 మంది ఫోన్‌ చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 30 వరకూ కాల్స్‌ వస్తున్నాయి. కాల్‌ సెంటర్‌ను సంప్రదించిన వారిలో ఎక్కువ మందిలో డిప్రెషన్‌ సమస్య ఉన్నట్టు కౌన్సెలర్లు చెబుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి భయం, లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ రోజులు ఒంటరిగా గడపడం, కుటుంబ సభ్యులు, సన్నిహతులు మృత్యువాత పడటం.. ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి డిప్రెషన్‌కు ముఖ్య కారణాలుగా బాధితులు చెబుతున్నట్టు వెల్లడైంది. 

కొందరిలో ఈ సమస్య ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నట్టు తెలిసింది. మరికొందరిలో సమస్య తీవ్రమై.. తమ చుట్టూ ఉండే కుర్చీలు, బల్లలు, ఇతర వస్తువులు మాట్లాడుతున్నా­యన్న భావన కలుగుతోందని చెబుతున్నారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు సైతం కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారే. కరోనా కారణంగా రెండేళ్ల పాటు అకడమిక్‌ ఇయర్‌ దెబ్బతింది. దీనికి తోడు, కొందరు తల్లిదండ్రులు పిల్లల అభిరుచులు, సామర్థ్యాలు పట్టించుకోకుండా పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు రావాలి, ఐఐటీ, నీట్‌లో ర్యాంక్‌లు సాధించాలి.. అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలు సైతం మార్కులు, ర్యాంక్‌ల కోణంలోనే విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ ధోరణుల మధ్య తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాథమిక దశలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం
మానసిక సమస్యలు ఉన్నవారు ప్రాథమిక దశలోనే కౌన్సెలర్లు, వైద్యులను సంప్రదిస్తే మంచిది. అయితే చూసే వాళ్లు ఏమనుకుంటారోనని కౌన్సిలర్‌లు, వైద్యులను సంప్రదించడానికి విముఖత వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారు 14416 లేదా 180089114416 నంబర్‌కు కాల్‌ చేసి మానసికంగా ఉపశమనం పొందుతున్నారు. నచ్చిన పాటలు వినడం, సినిమాలు చూడటం, విహార యాత్రలకు వెళ్లడం వంటి కార్యకలాపాలు చేస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు.  
– ఎ.అనంత్‌కుమార్, కౌన్సెలర్, సూపర్‌వైజర్‌ టెలీ మానస్‌ కాల్‌సెంటర్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top