హామీలను త్వరగా అమలు చేయండి

Venkaiah Naidu reviewed works in Telugu states - Sakshi

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఉపరాష్ట్రపతి సూచన 

తెలుగు రాష్ట్రాల్లోని పనులను సమీక్షించిన వెంకయ్యనాయుడు 

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్న, ప్రతిపాదిత ప్రాంతాలకు అధికారులు వ్యక్తిగతంగా వెళ్లడం ద్వారానే పనులు వేగం పుంజుకుంటాయని చెప్పారు. సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణల్లో చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఆయన సోమవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో సమీక్షించారు.

ఈ కార్యక్రమాల పురోగతిని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఉపరాష్ట్రపతికి వివరించారు. కాకినాడ సీ–ఫ్రంట్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నెల్లూరు–పులికాట్‌–ఉబ్బలమడుగు వాటర్‌ ఫాల్స్‌–నేలపట్టు–కొత్తకోడూరు–మైపాడు–రామతీర్థం–ఇస్కపల్లి ప్రాజెక్టుతో పాటుగా కోస్టల్‌ సర్క్యూట్, బుద్ధిస్ట్‌ సర్క్యూట్, గుంటూరు, అమరావతి నగరాల్లో పర్యాటక అభివృద్ధి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం ఆలయాల అభివృద్ధి, నెల్లూరులోని వేదగిరి నరసింహస్వామి దేవాలయం, అరకు–విశాఖ విస్టాడోమ్‌ (రైల్వే) ప్రాజెక్టు, తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి, పుట్టపర్తిలో సౌండ్‌ లైట్‌ షో పనుల వివరాలు తెలిపారు. ఉడాన్‌ పథకంలో భాగంగా విశాఖ–రాజమండ్రి, హైదరాబాద్‌–విద్యానగర్‌ (హంపి) రూట్ల పురోగతిని వివరించారు. వీలైనంత త్వరగా వీటిని పూర్తిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top