ఆటవికం.. అరాచకం | Velpula Ramu A-1 in Pulivendula ZPTC by-election incident | Sakshi
Sakshi News home page

ఆటవికం.. అరాచకం

Aug 10 2025 5:50 AM | Updated on Aug 10 2025 5:50 AM

Velpula Ramu A-1 in Pulivendula ZPTC by-election incident

ఇటీవల టీడీపీ మూకల దాడిలో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్న వేల్పుల రామలింగారెడ్డి

జరగని ఘటనలో వేల్పుల రాము ఏ–1గా.. మరో 50 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు  

అసలు దాడి చేసిన టీడీపీ మూక కళ్లెదుటే తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ బాబు పోలీసు యంత్రాంగం దమనకాండ 

దాడికి పాల్పడిన వారు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో బాధితులపైనే ఉల్టా కేసు 

ఆ తప్పుడు కేసులో శనివారం 9 మందిని అరెస్టు చేసినట్లు పోలీసుల ప్రకటన 

పిండారీలు, కాలకేయులను తలదన్నే రీతిలో వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ మూక దాడి 

పెళ్లి వేడుకలో ఉన్న సైదాపురం సురేష్ కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డిపై దాడి  

ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం 

ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రాముకు తల పగిలి, తీవ్ర రక్తస్రావం 

తీవ్ర గాయాలతో బతికి బట్టకట్టిన ఎమ్మెల్సీ, బీసీ నేత రమేష్ కుమార్‌ యాదవ్‌  

ఒక్క పులివెందుల మండలంలోనే 150 మంది వైఎస్సార్‌సీపీ నేతల బైండోవర్‌ 

ఎన్నికల ప్రక్రియ, పోలింగ్‌ నుంచి వారిని తప్పించాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ 

ఇన్ని చేసినా ఫలితం లేక తాజాగా పోలింగ్‌ బూత్‌ల మారి్పడికి కుట్ర..4 కిలోమీటర్ల దూరంలోని ఊళ్ల ఓట్లు అటూ ఇటూ మార్పు 

పోలింగ్‌ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని రిగ్గింగ్‌ చేసుకోవాలనే పన్నాగం  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు ఎన్ని అడ్డదారులు ఉన్నాయో.. అన్నింటినీ ఉపయోగించినా ఫలితం కనిపించక పోవడంతో టీడీపీ పెద్దలు ఇదివరకెన్నడూ లేని విధంగా అరాచకానికి తెరలేపారు. పిండారీలు, కాలకేయులు, బందిపోట్లను తలదన్నే రీతిలో టీడీపీ మూక వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలో అత్యంత క్రూరంగా, కిరాతకంగా చేసిన దాడిలో.. తీవ్రంగా గాయపడి, ఒంటి నిండా రక్తమోడుతూ ప్రాణంతో బతికి బట్టకట్టిన బాధితుడినే ప్రథమ (ఏ1) నిందితుడిగా చేస్తూ మరో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ కేసులో తొమ్మది మందిని పోలీసులు.. శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇదే కేసులో పులివెందుల మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులను ఇరికించి, అరెస్టు చేసి.. జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్‌ రోజున వారిని లేకుండా చేయాలన్నదే ముఖ్యనేత ఎత్తుగడ. కానీ.. అత్యంత కిరాతకంగా క్రూరంగా హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ కాలకేయులు కళ్లెదుటే తిరుగుతున్నా, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నా.. వారి వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు.

చంద్రబాబు పోలీసు యంత్రాంగం సాగిస్తున్న ఈ ఆటవిక, అరాచకానికి పులివెందుల వేదికైంది. టీడీపీ మూక పాశవికంగా చేసిన దాడిలో.. తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో బయట పడిన వేల్పుల రాము (రామలింగారెడ్డి)ను పోలీసులు ఏ–1గా చేరుస్తూ ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. జరగని ఘటనలు జరిగినట్లు.. కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరిస్తూ.. పోలీసు యంత్రాంగం అరాచకం సృష్టిస్తోంది. టీడీపీ మూక దాడిలో తల పగిలి వేల్పుల రాము శరీరంపై రక్తపుధారలు కారుతున్న దృశ్యాలు ససాక్ష్యంగా కన్పిస్తున్నా.. వైఎస్సార్‌సీపీ నేతలకు రక్తపు గాయాలు ఏమీ కాలేదని, తాము స్పందించకపోయి ఉంటే వారి తలలు ఎగిరిపోయేవని కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ చేసిన వ్యాఖ్యలు పోలీసుల దమనకాండకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

ఉప ఎన్నిక గండం గట్టెక్కేందుకే అరాచకం 
సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీలను అటకెక్కించడం.. రెడ్‌ బుక్‌ కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ మూక రక్తపుటేరులు పారిస్తుండటం.. అవినీతి, అక్రమాలను వ్యవస్థీకృతం చేసి, నీకింత నాకింతా అంటూ చంద్రబాబు గ్యాంగ్‌ దోచుకుతింటుండటంతో 14 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. దాంతో ప్రజల దృష్టి మళ్లించడానికి ఎప్పటికప్పుడు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతూ చంద్రబాబు నెట్టుకొస్తున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలను తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేశారు. భారీ ఎత్తున ప్రలోభపెట్టి లొంగదీసుకోవడానికి కుట్రలు చేశారు. కానీ ఆ కుట్రలు ఏవీ పారక పోవడంతో ముఖ్య నేత కనుసైగలతో పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పులివెందుల శ్రీకర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్‌రెడ్డిలపై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌బాషా (కిరికిరి బాషా) ముఠా దాడి చేసి వెళ్లిపోయింది.

ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఏమాత్రం పట్టించుకోలేదు. బుధవారం నల్లగొండువారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై బందిపోటు దొంగల ముఠా తరహాలో టీడీపీ రౌడీ మూకలు మెరుపు దాడి చేశాయి. ఒక్కసారిగా దాదాపు 100 మంది రాడ్లు, కర్రలు, ఇతర మారణాయుధాలతో వారిని చుట్టుముట్టి మట్టు బెట్టేందుకు యత్నించారు. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్‌ యాదవ్‌ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. ఎమ్మెల్సీ రేంజ్‌ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫారŠుచ్యనర్, స్కార్పియో వాహనాలనూ సమ్మెటలతో ధ్వంసం చేశారు.

రామలింగారెడ్డి ఉన్న ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించబోయారు. గ్రామస్తులు ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో రౌడీ మూకలు పారిపోయాయి. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలోనే పోలీసులు ఉన్నప్పటికీ.. చూసి చూడనట్లు పట్టించుకోక పోవడం కుట్రకు నిదర్శనం. ఈ దాడి విషయమై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడికి పాల్పడిన వారు పోలీసుల కళ్లెదుటే తిరుగుతున్నా పట్టించుకోకపోగా, బాధితులైన వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనే కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకోవడం.. అరెస్టు చేయడం ప్రభుత్వ దమనకాండకు, దుర్మార్గానికి నిదర్శనంగా నిలుస్తోంది. 

పరాకాష్టకు చేరిన ఆకృత్యాలు 
అదే బుధవారం రోజున జరగని ఘటనను జరిగినట్టుగా టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు వేల్పుల రామును ఏ–1గా, హేమాద్రి రెడ్డిని ఏ–2గా చేర్చుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం గమనార్హం. ఈ కేసును అడ్డం పెట్టుకుని శుక్రవారం రాత్రి 12 మంది వైఎస్సార్‌సీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శనివారం ముగ్గురిని వదిలేసి.. మిగతా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇదే కేసులో పులివెందుల మండలంలో కీలకమైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా ఇరికించి, అరెస్టు చేయడానికి పోలీసులు పావులు కదుపుతున్నారు.

ఎన్నికల ప్రక్రియ నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులను తప్పించడానికే తప్పుడు ఫిర్యాదులు, అక్రమ కేసులు, అరెస్టుల కుట్రకు తెరతీశారన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ఆదేశాలకు తలొగ్గుతూ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు­న్నా­రని.. తమ రాజకీయ జీవితాల్లో ఇంతటి దుర్మార్గాలు ఎన్నడూ చూడలేదంటూ రాజకీయ పార్టీల నేతలు నివ్వెరపోతు­న్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో కీలకమైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బైండోవర్‌ చేస్తున్నారు. ఒక్క పులివెందుల మండలంలోనే శనివారం రాత్రి వరకు 150 మందిని బైండోవర్‌ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌ల మార్పు 
ఇన్నిన్ని అరాచకాలకు పాల్పడినా ఫలితమివ్వక పోవడంతో టీడీపీ నేతలు తాజాగా మరో కుట్రకు తెరలేపారు. ఉప ఎన్నికలో ఓటింగ్‌ శాతం తగ్గించి, లబ్ధి పొందాలనే కుట్రలకు పదును పెడుతున్నారు. ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేస్తున్నారు. పులివెందుల మండలంలోని ఎర్రబల్లె కొత్తపల్లె పంచాయతీలో 6, 7 నంబర్ల పోలింగ్‌ బూత్‌లు, నల్లగొండువారిపల్లెలో పోలింగ్‌ బూత్‌ 8, నల్లపురెడ్డిపల్లెలో 9, 10, 11 బూత్‌లు ఉన్నాయి.

ఇది వరకు ఏ గ్రామానికి చెందిన ఓటర్లు ఆ గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునే వారు. తాజాగా ఎర్రబల్లె కొత్తపల్లె ఓటర్లు నల్లపురెడ్డిపల్లె బూత్‌లలో, నల్లపురెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె కొత్తపల్లె బూత్‌ల పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు. ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్‌) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో పలువురు అవాక్కవు­తున్నారు. ఓటు వేయాలంటే 4 కిలోమీటర్లు పక్క గ్రామంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకుని పోలింగ్‌ను ప్రభావితం చేయడానికి టీడీపీ స్కెచ్‌ వేసింది.

ఓట్లు వేయకుండా అడ్డుకోవడం, లేదా రిగ్గింగ్‌ చేయడానికి ఈ ఎత్తుగడ వేశారు. పోలీసుల అండదండలతో పోలింగ్‌ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకు­నేలా టీడీపీ రాక్షస వ్యూహం రచించింది. దీనికి పోలీ­సులు, అధికార వర్గాలు దన్నుగా నిలస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. పోలింగ్‌ బూత్‌లను మార్చవద్దని, యథాతథంగా ఉంచాలని డిమాండ్‌ చేసింది. కానీ.. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించక పోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement