
మూడు రెట్లు పెరిగిన విలువ
2024–25పై ఆర్‌బీఐ నివేదిక
ప్రభుత్వ రంగ బ్యాంకులకే అధిక నష్టం
సాక్షి, అమరావతి: రుణ ఖాతాలు, డిజిటల్ పేమెంట్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ నేరాల విలువ 2023–24తో పోల్చిచూస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ మోసాల విలువ రూ.12,230 కోట్ల నుంచి రూ.36,014 కోట్లకు ఎగసింది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఇదే కాలంలో నేరాల సంఖ్య మాత్రం 36,060 నుంచి 23,953కు తగ్గింది.
ఫ్రాడ్ క్లాసిఫికేషన్‌కు సంబంధించి 2023 మార్చి 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, గత సంవత్సరాల్లో నివేదించిన రూ.18,674 కోట్ల విలువైన 122 కేసులను తిరిగి తాజా నేరాలుగా నమోదు చేయడం వల్ల మొత్తం నేరాల విలువ పెరిగిందని ఆర్‌బీఐ నివేదిక వివరించడం గమనార్హం. మొత్తం నేరాల సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులకు సంబంధించినవి 60 శాతం ఉన్నాయి. కానీ విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకులవి 71 శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
» నేరాల సంఖ్యలో ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల (కార్డ్, ఇంటర్నెట్) కేటగిరీలో చోటుచేసుకున్నాయి. అయితే విలువ పరంగా చూస్తే లోన్ లేదా అడ్వాన్స్ ఖాతాల్లోనే ఎక్కువ నేరాలు జరిగాయి.
» ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువగా కార్డ్, ఇంటర్నెట్ నేరాలు జరగ్గా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్ పోర్టుఫోలియోకి
సంబంధించిన నేరాలు ఎక్కువ ఉన్నాయి.
» మొత్తం కేసుల్లో లోన్ సంబంధిత నేరాలు 33 శాతానికి పైగా ఉండగా, మొత్తం నేరాల విలువలో 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
» 2024–25 చివరిలో కార్డ్, ఇంటర్నెట్ నేరాల కేటగిరీలో 13,516 కేసులు నమోదయ్యాయి. ఇవి మొత్తం 23,953 నేరాల్లో 56.5 శాతం.
» రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఉన్న కేసుల వివరాలనే నివేదికలో పొందుపరచడం జరిగింది.
» సంస్థలు తమ నివేదికలను సవరిస్తే ఈ డేటా మారే అవకాశం కూడా ఉంది.
» నివేదికలో పేర్కొన్న మొత్తాన్ని ‘కోల్పోయిన నష్టం’గా పరిగణించడం సరికాదు. రికవరీల ఆధారంగా నష్టం తగ్గవచ్చు.
భద్రత కోసం కొత్త డొమెయిన్‌లు..
డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న నేరాలపై పోరాటానికి ఒక వినూత్న ప్రయత్నంగా భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా ‘..bank.in’, నాన్–బ్యాంకుల కోసం ‘fin.in’ అనే ఇంటర్నెట్ డొమెయిన్‌లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ చేసింది. ఈ ప్రయత్నం డిజిటల్ బ్యాంకింగ్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది, సైబర్ మోసాలను గుర్తించడంలో అలాగే ఫిషింగ్ వంటి ప్రమాదకరమైన కార్యకలాపాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) ఈ డొమెయిన్‌లకు ప్రత్యేక రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తుందని, బ్యాంకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని నివేదిక తెలిపింది.
