
సాక్షి, అమరావతి: గ్రామాల్లో తిరుగాడే వీధి కుక్కలన్నింటికీ ర్యాబీస్ వ్యాధి వ్యాప్తి నిరోధక టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాబీస్ వ్యాధి నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీరాజ్‌శాఖ ఈ టీకాల కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో వీధి కుక్కలలో సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ఆపరేషన్ చేయించడంతో పాటు కుక్క కరిచినా ర్యాబీస్ సోకకుండా శునకాలకు టీకాలు వేస్తారు.
వీధి కుక్కల టీకాలు వేసే ప్రక్రియలో పశు సంవర్థక శాఖ సిబ్బందితో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించింది. మండలంలో ప్రతి రోజూ కనీసం 10 వీధి కుక్కలకు, జిల్లాలో కనీసం 500 కుక్కలకు టీకాలు వేయాలని పేర్కొంది. జిల్లాల వారీగా వీధి కుక్కల టీకాల పురోగతిని ఎప్పటికప్పుడు కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించింది. కాగా, 2020 పూర్తి ఏడాదితో పాటు 2021లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల మంది కుక్క కాటుకు గురైనట్లు అంచనా.