
పలు ప్రాంతాల్లో మామిడి తోటలకు తీవ్ర నష్టం
అన్నమయ్య జిల్లాలో 3,500 ఎకరాల్లో రాలిపోయిన కాయలు
చిత్తూరు, జగ్గయ్యపేటలో పడిపోయిన విద్యుత్ స్తంభాలు
పిడుగుపాటుతో ప్రకాశం జిల్లాలో 20 మేకలు, మన్యం జిల్లాలో రెండు ఆవులు మృతి
నష్టం అంచనా వేసి ఆదుకోవాలంటున్న రైతులు
సాక్షి రాయచోటి/జగ్గయ్యపేట/పలమనేరు/వీరఘట్టం: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు మామిడి, అరటి, వరి, మొక్కజొన్న రైతులకు తీరని నష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లాలో పెనుగాలులు, వర్షం బీభత్సం సృష్టించింది. రాయచోటి నియోజకవర్గంలోని పలు మండలాల్లో మామిడికి అపారనష్టం వాటిల్లగా, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది. రాయచోటి నియోజకవర్గ పరి«ధిలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లె, పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలంలో మామిడి కాయలు పెద్ద ఎత్తున నేలరాలాయి.
రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి, సిద్దవటం, రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అరటి, బొప్పాయి పంటకు కూడా నష్టం వాటిల్లింది. వీరబల్లి ప్రాంతంలో మామిడి చెట్లు విరిగి పడ్డాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 3,500 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. రైతులు కోట్లాది విలువైన పంటను నష్టపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో దాదాపు 2 గంటల పాటు బలంగా వీచిన గాలులకు షేర్‌మహ్మద్‌పేట, బలుసుపాడు, రామచంద్రునిపేట పంట పొలాల్లోని విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
మామిడి తోటల్లో చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. షేర్‌మహ్మద్‌పేటలో మూడు రేకుల ఇళ్లకు పైకప్పు లేచిపోయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. 20కి పైగా విద్యుత్ స్తంభాలు పడిపోవటంతో శుక్రవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జగ్గయ్యపేటలోని కోదాడ రోడ్డులో బాక్స్ క్రికెట్ కేంద్రం కుప్పకూలింది.
తీగ పంటలకూ అపార నష్టం
చిత్తూరు, పలమనేరు మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా భారీ వర్షం కురిసింది. మామిడి, తీగ పంటలు దెబ్బతిన్నాయి. చిత్తూరులోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలమనేరు ప్రాంతంలో బీర, కాకర, బీన్సు, అరటి తోటలు దెబ్బతిన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అరటి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది.
వీరఘట్టం ఆర్‌అండ్‌బీ బంగ్లా సమీపంలో లెంక మురళీ అనే రైతుకు చెందిన రెండు పాడి ఆవులు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అరటి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. రూ.10 లక్షల మేర విద్యుత్ శాఖకు నష్టం సంభవించింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పోలవరం పంచాయతీ కలగట్ల సమీపంలోని పొలాల్లో పిడుగు పడి 20 మేకలు మృతి చెందాయి. ఆముదాలవలసలో 69.5 మి.మీ, శ్రీకాకుళంలో 65, చాగల్లులో 62.2, గిద్దలూరులో 54, కనిగిరిలో 51.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.