2011 జనాభా లెక్కలే ప్రాతిపదిక.. కేంద్రం నిర్ణయం
లోక్‌సభ, 28 రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు గంపగుత్తగా 50 శాతం పెంపు
33 శాతం స్థానాలు మహిళలకు రిజర్వేషన్
దేశంలో 543 నుంచి 816కు పెరగనున్న లోక్‌సభ స్థానాలు
అందులో 270 స్థానాలు మహిళలకు రిజర్వేషన్
సాక్షి, అమరావతి: దేశంలో లోక్‌సభ, శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం మార్గం సుగమం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది. దేశంలో లోక్‌సభతోపాటు 28 రాష్ట్రాలలో శాసనసభ స్థానాలను గంపగుత్తగా 50 శాతం పెంచాలని నిర్ణయించింది.. అందులో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేయనుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే సార్వత్రిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. పునర్విభజన తర్వాత దేశంలో లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కు పెరగనున్నాయి. ఇందులో మహిళలకు 33 శాతం అంటే 270 స్థానాలను రిజర్వేషన్ చేయనున్నారు.
జనాభా గణనతోనే ఆలస్యం..
దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణనను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. షెడ్యూలు ప్రకారం జనాభా గణన 2021లో జరగాలి. అయితే కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల అప్పట్లో జనాభా గణన చేపట్టలేదు. అప్పట్లో నిర్వహించాల్సిన జనాభా గణనను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ మొదటి విడత.. రెండో విడత 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. అయితే 2027 జనాభా గణన లెక్కలు తేలేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ఎస్సీ, ఎస్టీలకు..
దేశంలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు లోక్‌సభ సీట్లు 84 ఉన్నాయి. ఎస్టీ వర్గాలకు సంబంధించి రిజర్వుడు లోక్‌సభ స్థానాలు 47 ఉన్నాయి. నియోజక వర్గాల పునర్విభజనతో సీట్ల పెంపు నేపథ్యంలో అదే దామాషాలో వారి సీట్లు పెరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు గరిష్టంగా ఉన్న చోట ఆయా వర్గాలకే సీట్లు కేటాయించనున్నారు. ఈ సామాజిక వర్గాలకు అసెంబ్లీ స్థానాలు కూడా అదే నిష్పత్తిలో పెరగనున్నాయి.
ఇది ఐదోసారి...
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నియోజకవర్గాల పునర్విభజనను గతంలో నాలుగు సార్లు (1952, 1963, 1973, 2002–2008) కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ఐదోది కావడం గమనార్హం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును 2023లో పార్లమెంటు ఆమోదించింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ (ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌తో కలిపి) 128వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
ఈ క్రమంలో దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ, శాసనసభ స్థానాలను గంపగుత్తగా 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఆ మేరకు లోక్‌సభ, శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే బిల్లును పార్లమెంటు రెండింట మూడొంతుల మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుత సమావేశాల్లోగానీ లేదా వర్షాకాల సమావేశాలు లేదంటే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో ఎంపీ సీట్లు పెంపు ఇలా..
రాష్ట్రంలో ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 25 ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో 50 శాతం అంటే 12.5 స్థానాలు పెరగాలి.. కానీ 50 శాతం స్థానాలు పెంచేటప్పుడు 12.4 స్థానాలు వస్తే.. దాన్ని 12గానే పరిగణించి స్థానాలు పెంచుతారు. అదే 12.6 స్థానాలు వస్తే.. దాన్ని 13 స్థానాలుగా పరిగణించి పెంచుతారు. ఈ నేపథ్యంలో ఏపీలో 12.5 స్థానాలు వస్తే లాటరీ వేస్తారు. ఆ లాటరీలో రాష్ట్రానికి అనుకూలంగా ఫలితం వస్తే 13 స్థానాలు.. ప్రతికూలంగా వస్తే 12 స్థానాలనే పెంచుతారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విజన తర్వాత రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతాయి. ఇందులో 33 శాతం అంటే 12 లేదా 13 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేస్తారు.
అసెంబ్లీ స్థానాలు పెరిగేది ఇలా..
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ సీట్లు 262 లేదా 263కు పెరుగుతాయి. అందులో 33 శాతం... అంటే 86 లేదా 87 స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. రాష్ట్రంలో ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1.60 లక్షల మంది ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు.


