శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

TTD Said Old And Childrens Can Visit Tirumala Following Covid Rules - Sakshi

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ  వృద్ధులు, చిన్నపిల్లలకు దర్శనం

సాక్షి, తిరుమల : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. వృద్ధులు, చిన్న పిల్లలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపింది. కోవిడ్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గర్శకాల మేరకు 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్లలోపు పిల్లలను స్వామి వారి దర్శనానికి అనుమతించడం లేదు. దీనిపై టీటీడీకి నిత్యం వేల సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయి. చిన్న పిల్లల కేశ ఖండన, చెవిపోగులు కుట్టడం, అన్నప్రాసన, షష్టి పూర్తి చేసుకొనేవారు, 70–80 ఏళ్ల శాంతి చేసుకొనే వారు ఉంటున్నారు. భక్తుల ఆచారాలు, సంప్రదాయాలు, మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలు కావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్ల లోపు పిల్లలు కోవిడ్‌ సూచనలు దృష్టిలో ఉంచుకుని, వారి ఆరోగ్య పరిస్థితులను గమనించుకొని జాగ్రత్తలతో స్వామి దర్శనానికి రావచ్చని తెలిపింది. ముందస్తుగా దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని, వీరికి ఎలాంటి ప్రత్యేక క్యూలైన్లు ఉండవని టీటీడీ తెలిపింది.

ఏకాదశి ఆన్‌లైన్‌ కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్‌ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను (రోజుకు దాదాపు 20 వేల టికెట్లు) శుక్రవారం ఉదయం 6.30 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. 

నేడు డయల్‌ యువర్‌ ఈవో
డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరగనుంది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డికి ఫోన్‌ చేసి నేరుగా తెలపవచ్చు. భక్తులు సంప్రదించవలసిన నంబర్‌ 0877–2263261.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top