టీటీడీ పాలక మండలి నిర్ణయాలు.. సామాన్య భక్తులకు పెద్దపీట

TTD Governing Council Decisions SSD Tickets Available After Brahmotsavam - Sakshi

సాక్షి, తిరుమల: టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన పాలక మండలి‌ సమావేశంలో పలు‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని, కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.. టీటీడీకి సంబంధించిన 960 స్థిర ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని, ఆస్తుల విలువ రూ 85 వేల 705 కోట్లు ఉంటుందని ఆయన ప్రకటించారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్న ఆయన, తిరుమలలో సామన్య భక్తులకు వసతి సదుపాయం పెంపుపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గోవర్థన సత్రాల వెనుక భాగంలో 95 కోట్లతో పీఏసీ-5 నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, వకూళమాత ఆలయం నుండి జూపార్క్ వరకు 30 కోట్లతో కనెక్టివిటీ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించామన్నారు.

తిరుమలలోని గదుల్లో గీజర్‌లు ఏర్పాటుకు రూ.7 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేసేందుకు చర్చించి నిర్ణయించుకున్నామని, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్, హాస్టల్ అభివృద్ధికి 6 కోట్లు 20 లక్షల నిధులు మంజూరు చేసామని,టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 300 ఎకరాలు ప్రభుత్వం నుండి ఇదివరకే కొనుగోలు చేసాంమని, భవిష్యత్తు అవసరాల కోసం రూ.25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

టైం స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరణ చేసి పెరటాసి మాసం అనంతరం తిరుపతిలో భక్తులకు సర్వ దర్శనం టోకన్లు జారీ  పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎలాంటి టోకన్లు, టిక్కెట్లు లేక పోయినా భక్తులను సర్వదర్శనం అనుమతించే విధానం యథావిధిగా కొనసాగుతుందన్నారు. విఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని, ఉదయం 10 గంటల తరువాత విఐపీ బ్రేక్  దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

పూర్తి స్ధాయిలో బ్రేక్ దర్శనాలపై ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత అమలు చేస్తామని తెలిపారు. వసతి కేటాయింపు ప్రక్రియను పూర్తిగా తిరుపతి నగరానికి మార్పు చేయాలని యోచనలో ఉన్నామని, బ్రహ్మోత్సవాల అనంతరం ప్రయోగత్మక పరిశీలన అనంతరం గదులు కరెంట్ బుకింగ్ విధానం తిరుపతికి తరలించాలని నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top