దళారీలకు టీటీడీ చెక్‌.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం

TTD Action on Dalari System 500 Crores Income to Srivari Treasury - Sakshi

తిరుమల: దళారీ వ్యవస్థకు టీటీడీ చెక్‌ పెడుతుండడంతో శ్రీవారి ఖజానా కాసులతో నిండుతోంది. సిఫార్సు వ్యవస్థని ఆసరాగా చేసుకొని జేబులు నింపుకుంటున్న దళారులను ఇంటిదారి పట్టించడంతో శ్రీవారి ఖజానాకు ఏడాదికి రూ.500 కోట్లు పైగానే ఆదాయం లభిస్తోంది. దర్శనాలు, ప్రసాదాలు సులభతరంగా లభిస్తుండడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

స్వామి దర్శనం తరువాత అధిక ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే. ఈ డిమాండ్‌ను దళారీలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 2004కి పూర్వం శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రోజుకి లక్ష వరకు మాత్రమే తయారు చేసేవారు. దీంతో భక్తులు అదనపు లడ్డూల కోసం దళారులను ఆశ్రయించేవారు. సిఫార్సు లేఖలపై కేటాయించే లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు రూ.50 చొప్పున దళారీలు విక్రయించేవారు. 2004లో బూందీ పోటుని ఆలయం వెలుపలికి మార్చడంతో లడ్డూల తయారీని దశలవారీగా టీటీడీ పెంచుతూ వచ్చింది. రోజుకి 3 నుంచి 5 లక్షల లడ్డూలు తయారుచేసే వెసులుబాటు లభించడంతో సిఫార్సు లేఖలు లేకుండా భక్తులకు లడ్డూ ప్రసాదాలు పొందే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

నడకదారి భక్తులకు మాత్రం ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తుండడం, అదనపు లడ్డూలను వివిధ స్లాబ్లలో అందజేశారు. ఇదే అదనుగా దళారులు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో కుమ్మక్కై లడ్డూ టోకెన్లు పక్కదారి పట్టిస్తూ భక్తులుకు అదనపు లడ్డూలను రూ.50 చొప్పున విక్రయించడం ప్రారంభించారు. దీంతో టీటీడీ ఈ స్లాబ్‌ల విధానాన్ని రద్దు చేసింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదంతోపాటు అదనంగా లడ్డూలు కావాలంటే రూ.50 చెల్లిస్తే చాలు కోరినన్ని లడ్డూలు అందించే ఏర్పాటు చేసింది. దీంతో దళారీ వ్యవస్థకు చెక్‌ పడింది. దీని ద్వారా శ్రీవారి ఖజానాకు ఏడాదికి రూ.250 కోట్ల ఆదాయం లభిస్తోంది.  

చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.40 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’)

దర్శన దళారీలకు బ్రేక్‌  
దర్శన విధానంలోనూ దళారీ వ్యవస్థకు బ్రేకులు వేయడంలో టీటీడీ సఫలీకృతమైంది. గతంలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను డిమాండ్‌ బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు దళారీలు విక్రయించేవారు. దీంతో శ్రీవారి ఖజానాకు గండి పడుతుండగా, భక్తుల జేబుకు చిల్లుపడేది. అదే సమయంలో భక్తులు అందించే విరాళాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించడం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం కోసం ప్రారంభించిన శ్రీవాణి ట్రస్ట్‌కి రూ.10 వేలు విరాళంగా అందిస్తే చాలు.

ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కేటాయించడం టీటీడీ ప్రారంభించింది. దీనికి భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 2019 అక్టోబర్‌లో ప్రారంభించిన ఈ పథకానికి మొదటి సంవత్సరం రూ.57 కోట్లు విరాళంగా అందగా, 2020లో రూ.76 కోట్లు విరాళాలు అందితే, 2021లో రూ.217 కోట్లు విరాళంగా అందాయి. ఇక ఈ ఏడాది శ్రీవాణి ట్రస్ట్‌కి నెలకు రూ.20 కోట్లు చొప్పున ఏడాదికి రూ.250 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. దీంతో దళారీ వ్యవస్థకి చెక్‌ పడగా మరోవైపు భక్తుల సొమ్ము నేరుగా స్వామి ఖజానాకు చేరుతోంది. ఇలా దర్శన, ప్రసాదాల విక్రయాలలో దళారీ వ్యవస్థ ను రూపుమాపేలా టీటీడీ  సంస్కరణలు తీసుకురావడంతో ఏడాదికి స్వామి వారికి అదనంగా రూ.500 కోట్ల ఆదాయం లభిస్తోంది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top