బలమైన గాలి వీచినా ఇక చెక్కుచెదరవ్‌!

Transco Towers in the newest design - Sakshi

సరికొత్త డిజైన్‌లో ట్రాన్స్‌కో టవర్స్‌ 

ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే అమరిక

ప్రణాళికను సిద్ధం చేసిన విద్యుత్‌ శాఖ

సాక్షి, అమరావతి: విద్యుత్‌ లైన్లను మరింత బలోపేతం చేయాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకునేలా నూతన డిజైన్‌ను తీసుకురాబోతోంది. దీని కోసం కొన్ని నెలలుగా దేశ, విదేశీ సాంకేతికతను అధ్యయనం చేసింది. తుపానుల నేపథ్యంలో తరచూ టవర్లు కూలుతుండటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటకు 300 కిలోమీటర్ల గాలి వీచినా తట్టుకునేలా టవర్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా వేసే లైన్లలో ముందుగా దీన్ని పాటించనుంది. ప్రస్తుతం ఉన్న లైన్లను క్రమంగా ఈ స్థాయికి తీసుకువచ్చే వీలుందని గ్రిడ్‌ అధికారులు వెల్లడించారు. 

ఎంతకైనా తట్టుకునేలా...
► ఏపీ ట్రాన్స్‌కోకు రాష్ట్రవ్యాప్తంగా 400 కేవీ, 220, 132 కేవీల లైన్లు, సబ్‌స్టేషన్లు, లైన్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త లైన్లు వేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని లైన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 
► ప్రస్తుతం ట్రాన్స్‌కో టవర్స్‌ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా తట్టుకుంటాయి. భూమి తీరును బట్టి వీటి నిర్మాణం చేపడతారు. నేల మెత్తగా ఉంటే మరింత లోతుగా, ఎక్కువ ఇనుము వాడి పునాది గట్టిగా వేస్తారు.
► హుద్‌హుద్‌ తుపాను సమయంలో బలమైన ట్రాన్స్‌కో టవర్లకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. తుపాను తాకిడికి దాదాపు 62 విద్యుత్‌ టవర్లు నేలకూలాయి. కల్పక–ఖమ్మం లైన్‌లో 400 కిలోవాట్ల సామర్థ్యం గత 14 టవర్స్‌ పడిపోయాయి.
► సాధారణంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని మించి గాలి వీచిన దాఖలాలు అప్పటి వరకూ లేవు. హుద్‌హుద్‌ అనుభవాన్ని పరిశీలించిన తర్వాత గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే టవర్స్‌ నిర్మాణం అవసరమని ట్రాన్స్‌కో భావిస్తోంది. 
► తుపాను ప్రభావిత ప్రాంతాలపైనే ముందుగా అధికారులు దృష్టి పెట్టారు. అక్కడి పరిస్థితులను బట్టి డిజైన్‌కు రూపకల్పన చేశామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడున్న దానికన్నా టవర్‌ ఎత్తు పెంచడం, మరింత బలమైన మెటీరియల్‌ ఉపయోగించేలా డిజైన్‌లో మార్పు తెచ్చినట్లు అధికారులు తెలిపారు. 
► కొత్త డిజైన్‌ను అందుబాటులోకి తెస్తే టవర్‌ నిర్మాణ వ్యయం స్వల్పంగా పెరిగే వీలుందని, అయితే, ఎలాంటి తుపానులొచ్చినా కూలిపోయే వీల్లేదని చెప్పారు. ఆ సమయంలో జరిగే నష్టంతో పోల్చుకుంటే ఇప్పుడే కొంత ఎక్కువ వెచ్చించడం భారం కాదన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top