సూర్యాపేట జిల్లా: అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు.
కేసు వివరాలిలా..
అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్‌లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్‌తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం..
గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధురి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు.


