పండుగ వేళ.. తీరని విషాదం | Tragedy occurred on Friday at the Andhra Pradesh Telangana border | Sakshi
Sakshi News home page

పండుగ వేళ.. తీరని విషాదం

Mar 21 2026 4:58 AM | Updated on Mar 21 2026 4:59 AM

Tragedy occurred on Friday at the Andhra Pradesh Telangana border

ఫొటోలు దిగేందుకు గోదావరిలో దిగిన ఏడుగురు విద్యార్థులు

ఐదుగురు గల్లంతు.. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం ఏపీ– తెలంగాణ సరిహద్దులోని కొల్లుగూడెం వద్ద దుర్ఘటన

ఇద్దరిది కృష్ణా జిల్లా ఉయ్యూరు, ఇంకొకరిది మదనపల్లె, మరో ఇద్దరిది తెలంగాణలోని భద్రాచలం

తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ ఘటనాస్థలిలో ఏపీ అధికారుల వాదులాట

మానవత్వంతో స్పందించి రక్షణ చర్యలు చేపట్టిన తెలంగాణ అధికారులు

భద్రాచలం అర్బన్‌/ఉయ్యూరు రూరల్‌/కుక్కునూరు/మంగళగిరి టౌన్‌/ఎటపాక: గోదావరి తీరం వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం దగ్గర గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు ఏపీ వాసులు, ఇద్దరు భద్రాచలం వాసులుగా తేలింది. ముగ్గురి మృతదేహాలు లభించాయి. భద్రాచలం పట్టణానికి చెందిన చారిగుంట్ల శ్రీకర్‌గుప్తా(21) విజయవాడలోని అమరావతి ఎస్‌ఆ­ర్‌ఎమ్‌ కాలేజీలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం, పొడిచేటి అభిరామ్‌(21) భద్రాచలంలో వేద విద్య అభ్యసిస్తున్నారు. 

వీరు ఏపీ, తెలంగాణ సరిహద్దులోని గోదావరి నదిలో గతంలో దిగిన ఫొటోలను తమ స్నేహితులకు చూపించారు. దీంతో ఆ ప్రదేశం బాగుందని మిత్ర బృందం భావించింది. ఈక్రమంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నామని చెప్పి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం  కనుమూరు గ్రామానికి చెందిన దగ్గుబాటి నవదీప్‌(19), ఉయ్యూరుకు చెందిన గోక తేజజ్ఞసాయి(19), మదనపల్లెకు చెందిన సతీశ్‌(19)తో పాటు మరో ఇద్దరు స్నేహితులైన సీహెచ్‌.దీపక్, గడ్డం హర్షవర్ధన్‌ ఐదుగురు గురువారం ఉదయం భద్రాచలం చేరుకున్నారు. 

వీరందరూ విజయవాడ సమీపంలోని విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. స్థానికులైన శ్రీకర్, అభిరామ్‌తో కలిసి మధ్యాహ్నం భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం సరదాగా ఫొటోలు దిగేందుకు ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గోదావరి తీరానికి బయలుదేరారు. 

లోతు ఉన్న ప్రాంతం కావడంతో.. 
కొల్లుగూడెం దగ్గర గోదావరి నదిలో నీటి పాయ అవతలి ఒడ్డు(కుక్కునూరు) దిశగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నదిలో ఇసుక తిన్నెల్లో సుమారు రెండు కిలోమీటర్లు దూరం నడిచి, నీరు ఉన్న ప్రాంతానికి వారంతా చేరుకున్నారు. వీరు చేరుకున్న ప్రదేశానికి ఎగువన కిన్నెరసాని నది గోదావరిలో కలుస్తుండగా దిగువన కొంత దూరంలో పాములేరు వాగు కలుస్తుంది. దీంతో పెద్ద బండరాళ్లతో కూడిన ఆ ప్రదేశంలో నీరు ఎక్కువగా ఉంది. ఇక్కడ నీటి లోతు ఇరవై అడుగుల పైనే ఉంటుందని అంచనా. ఇది ప్రమాదకర ప్రదేశమని తెలియని విద్యార్థులంతా తమ ఫోన్లు ఒడ్డున ఉంచి నీళ్లలోకి దిగారు.

సాయం అందలేదు 
వారిలో ముందుగా తేజజ్ఞ లోతును అంచనా వేయలేక మునిగిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరుగా శ్రీకర్‌గుప్తా, అభిరామ్, నవదీప్, సతీశ్‌ కూడా మునిగారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంతో నీళ్లలో ఉన్న దీపక్‌ బయటకు వచ్చాడు. నీళ్లలోకి వెళ్లి గల్లంతవుతున్న వారిని కాపాడేందుకు హర్షవర్ధన్‌ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 

అలాగే, భద్రాచలం వైపు ఒడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉండడం, కుక్కునూరు వైపు పూర్తిగా నీరు ఉండడంతో సమీపంలో సాయం చేసే వారెవరూ కనిపించలేదు. కనీసం చేపలు పట్టే వారు కూడా ఆ సమయంలో లేరు. ఉదయం 11గంటలకు గోదావరిలో నీటి పాయ దగ్గరకు చేరుకుంటే కాసేపటికే 11–15 గంటలకు ప్రమాదం జరిగింది. నీళ్లలో మునిగిన స్నేహితులు ఎంతకూ బయటకు రాకపోవడంతో తమ ఫోన్ల ద్వారా 11–30 గంటలకు బయటకు సమాచారం చేరవేశారు.

గజ ఈతగాళ్లతో గాలింపు
స్నేహితులు ఐదుగురు గల్లంతైన సమాచారాన్ని దీపక్, హర్ష కలిసి శ్రీకర్‌ గుప్తా తండ్రికి ఫోన్‌లో చెప్పారు. దీంతో ఆయన భద్రాచలం పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులతో పాటు ఎటపాక అధికారులకు కూడా ఫోన్‌ చేశారు. గజ ఈతగాళ్లతో అక్కడికి చేరు­కున్న అధికారు­లు గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు శ్రీకర్, నవదీప్, అభిరామ్‌ మృతదేహాలు బయటపడగా.. సతీష్‌కుమార్, తేజజ్ఞ ఆచూకీ తెలియరాలేదు. ఉయ్యూరు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి విషాద చాయలు అలుముకున్నాయి.

మృతులు, గల్లంతైన వారి వివరాలు 
01) చారుగుళ్ల శ్రీకర్‌ గుప్తా(21), అమరావతి ఎస్‌ఆర్‌ఎమ్‌లో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ తండ్రి: చారుగుళ్ల రామకృష్ణ, భద్రాచలం 
02) దగ్గుబాటి నవదీప్‌(19), విజయవాడ కేఎల్‌యూలో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ తండ్రి: ఫణీంద్రనాథ్, కనుమూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 
03) పొడిచేటి అభిరామ్‌(19), వేదవిద్య తండ్రి: వంశీ, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ 
04) పాశం సతీష్ కుమార్‌(19), అమరావతి ఎస్‌ఆర్‌ఎమ్‌లో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ తండ్రి: పాశం నారాయణ, మదనపల్లె, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 
05) గోకా తేజజ్ఞ సాయి(19), అమరావతి ఎస్‌ఆర్‌ఎంలో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ స్వస్థలం: ఉయ్యూరు మండలం, 
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

స్థానిక అధికారుల తీరుపై తీవ్ర విమర్శ 
యువకులు నదిలో గల్లంతైన ఘటనలో ఆంధ్ర అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టగా ఆ తరువాత ఘటనా స్థలానికి ఎటపాక, కుక్కునూరు మండల అధికారులు వచ్చారు. ఈ ప్రాంతం తమ పరిధి కాదంటే.. తమ పరిధి కూడా కాదంటూ వాదించుకున్న తీరు స్థానికంగా వివాదాస్పదంగా మారింది. 

కనీసం మండల సరిహద్దులు తెలియకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారా ? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆదుకోవాల్సింది పోయి తమ ప్రాంతం కాదంటూ తప్పించుకునే వ్యవహార శైలి సరైనది కాదని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ సరిహద్దులు తెలియకుండా పాలనా వ్యవస్థ ఎలా నడిపిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థుల మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి 
సాక్షి, అమరావతి: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతై ముగ్గురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషాదకరమని, ఉన్నత భవిష్యత్‌ ఉన్న విద్యార్థులు ఇలా మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలి­పారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనో­బలం మృతుల కుటుంబాలకు కల­గా­­లని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా 
మృతుల కుటుంబాలకు సానుభూతి 
సాక్షి, అమరావతి: ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గాలింపు చర్యలు ముమ్మ­రం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సాను­భూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement