పొగాకు రైతుకు కంపెనీల కాటు | Tobacco farmers are concerned in Nandyala Distric | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుకు కంపెనీల కాటు

May 22 2025 5:17 AM | Updated on May 22 2025 5:17 AM

Tobacco farmers are concerned in Nandyala Distric

ముందుగానే ఒప్పందం చేసుకున్నా పొగాకు కొనుగోలు చేయని కంపెనీలు 

నంద్యాల జిల్లాలో రైతుల వద్దే రూ.150కోట్లకు పైగా విలువైన పొగాకు 

అగ్రిమెంట్‌ ధరకు పొగాకు కొనకపోతే తమ ఆస్తులన్నీ అమ్మినా అప్పులు తీరవని రైతుల ఆందోళన  

ప్రతి కిలో పొగాకును ఒప్పందం ప్రకారం కొనాలని డిమాండ్‌ 

ఆత్మకూరు: అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలు నేరుగా రైతుల వద్దకు వచ్చాయి. పొగాకు సాగు చేయండి క్వింటా రూ.15,500 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పాయి. ఆ మేరకు రైతులతో ఒప్పందం కూడా చేసుకున్నాయి. కంపెనీల మాటలు నమ్మి వేలాది ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కంపెనీలు ప్లేటు ఫిరాయించాయి. 

అధికంగా పొగాకు సాగు చేశారంటూ కొనుగోలు చేయకుండా మోసం చేశాయి. దీంతో కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం పొగాకు కొనుగోలు చేయకపోతే తమ ఇళ్లు, పొలాలు, ఆస్తులన్నీ అమ్మినా అప్పులు తీరవని నంద్యాల జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

20 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేత 
గతేడాది పొగాకు సాగు తక్కువగా ఉండటంతో రైతులను ప్రోత్సహించేందుకు ఐటీసీ, చుక్కబర్రి కంపెనీలు ముందుకొచ్చాయి. క్వింటా రూ.15,500 చొప్పున కొనుగోలు చేస్తామని గతే­డాది ఆగస్టు, సెపె్టంబర్‌ నెలల్లో రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో జిల్లాలో 17,215 ఎకరాల్లో పొగాకును సాగుచేశారు. ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, నంద్యాల, పాణ్యం, ఓర్వకల్లు, నందికొట్కూరు, బేతంచెర్ల, నంద్యాల ప్రాంతా­ల్లోని రైతులు అత్యధికంగా పొగాకును సాగుచేశారు. కంపెనీల అగ్రిమెంట్‌ ఉండటంతో కొందరు రైతులు కౌలుకు తీసుకుని 50 ఎకరాలు కూడా సాగు చేశారు. 

ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. రైతుల ఇళ్లు, కల్లాల వద్ద కుప్పలు కుప్పలుగా పొగాకు కనిపిస్తోంది. జిల్లా మొత్తం మీద 2,06,580 క్వింటాళ్ల పొగాకు దిగుబడి వచి్చంది. అయితే, తాము అగ్రిమెంట్‌ ఇచ్చిన దానికంటే రైతులు ఎక్కువగా పొగాకు సాగు చేశారని, దిగుబడి కూడా పెరిగిందని కంపెనీలు కొనుగోళ్లు నిలిపివేశాయి. సీజన్‌ ప్రారంభంలో కేవలం 20 నుంచి 40 శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేశాయి. దాదాపు 20 రోజులుగా కొనుగోళ్లను పూర్తి­గా నిలిపివేశాయి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో రైతుల వద్ద రూ.150 కోట్లకు పైగా విలువైన పొగాకు నిల్వలు ఉన్నాయి.

మా ఇంటి వద్ద 100 క్వింటాళ్ల పొగాకు ఉంది 
మా ఇంటి వద్ద 100 క్వింటాళ్ల పొగాకు ఉంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పొగాకును సాగు చేశా. కంపెనీలు పొగాకు సాగు చేయాలని చెప్పాయి. అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నాం. కానీ నేటికీ పొగాకును కొనుగోలు చేయలేదు. ఏమి చేయాలో తెలియడం లేదు. పొగాకును వర్షంలో తడవకుండా కాపాడుకోలేకపోతున్నాం. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలి.   – రామచంద్రుడు, రైతు, కొత్త రామాపురం నంద్యాల జిల్లా

పొలం, ఇల్లు అమ్మినా అప్పులు తీరవు 
ఎనిమిది ఎకరాల్లో పొగాకు సాగుచేశాం. 80 క్వింటాళ్లకు పైగా పొగాకు నిల్వ ఉంది. కంపెనీలు ఎప్పుడు కొనుగోలు చేస్తా­యో చెప్పడం లేదు. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఆ అప్పులు ఎలా తీర్చాలో కూడా తెలియడం లేదు. కంపెనీలు ఇచ్చిన అగ్రిమెంట్‌ ప్రకారం పొగాకు కొను­గోలు చేయపోతే మా పొలం, ఇల్లు అమ్ము­కున్నా అప్పులు తీరే పరిస్థితి కనిపించడం లేదు.  – శంకర్, రైతు, ఆత్మకూరు, నంద్యాల జిల్లా

కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలి 
ప్రభుత్వ పెద్దలు తరచూ కంపెనీలు పొగాకు కొనుగోలు చేస్తాయని ప్రకటిస్తున్నారు. కానీ మా జిల్లాలో మాత్రం కంపెనీలు 20 రోజులుగా రైతుల నుంచి కిలో పొగాకు కొనలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలి. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి అగ్రిమెంట్‌ ప్రకారం పొగాకు కొనుగోలు చేసేలా చూడాలి. – రవీంద్ర, రైతు, కొత్త రామాపురం, నంద్యాల జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement