ఎంత చెప్పినా మారరా..? | Tirupati Court fires on Tiruchanur Police: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఎంత చెప్పినా మారరా..?

Apr 14 2026 4:36 AM | Updated on Apr 14 2026 4:36 AM

Tirupati Court fires on Tiruchanur Police: Andhra pradesh

తిరుచానూరు పోలీసులపై తిరుపతి కోర్టు ఆగ్రహం 

తమను 48 గంటల పాటు నిర్బంధించి కొట్టారని నిందితుల వాంగ్మూలం

దీంతో నిందితులను మెడికల్‌ చెకప్‌కు పంపించిన న్యాయమూర్తి 

కొట్టిన ఎస్సై సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తామని స్పష్టికరణ 

సీఐకి మెమో జారీ చేయాలని ఆదేశిస్తామన్న న్యాయాధికారి 

వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసుల వ్యవహారంలో పోలీసుల దాష్టికం మరోసారి వెలుగులోకి..

సాక్షి టాస్క్ ఫోర్స్‌: చంద్రబాబు సర్కార్‌లో  వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి పెద్దల మెప్పు పొందాలన్న పోలీసుల దాష్టికం మరోసారి బట్టబయలైంది. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘర్షణ కేసులో 19 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు.. వీరిలో 13 మందిని అరెస్ట్‌చేసి తిరుపతి 2వ అదనపు మున్సిప్‌ కోర్టు  ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు హైడ్రామా నడిపారు. వీరిని తీవ్రంగా హింసించడమే దీనికి కారణం. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కోర్టుముందు హాజరుపరిచినప్పుడు, తమను పోలీసులు రెండు రోజుల పాటు నిర్బంధించి విచక్షణా రహితంగా కొట్టారని ఆరుగురు నిందితులు తెలిపారు. 

తమ శరీరంపై వున్న గాయాలను న్యాయమూర్తికి చూపించారు. దీంతో న్యాయమూర్తి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘మీకు ఎంత చెప్పినా మారరా? ఇష్టం వచ్చినట్లు కేసులు కడతారా..? అడగకుంటే నాపైన కూడా హత్యాయ­త్నం కేసు పెడతారా..? ఏ కేసు తెచ్చి­నా హత్యాయత్నం కేసు కింద పెడతారా ? ఇప్పుడు మీరు పెట్టిన హత్యాయత్నం కేసులో మీకు ఫిర్యాదు చేసిన వ్యక్తి గాయపడినట్లు వూండ్‌ (గాయాల) సర్టిఫికెట్‌ ఎక్కడ..? ఇలాగైతే మీపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.. పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి కొట్టడమేంటి..? కొట్టే హక్కు మీకు ఎవ్వరు ఇచ్చారు..? ఆ ఎస్సై సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తాం.. సీఐకి మెమో ఇవ్వమని ఆదేశిస్తాం..’ అంటూ న్యాయమూర్తి తీవ్ర ఆగ్ర­హం వ్యక్తం చేశారు.

 ‘పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలే తప్ప తప్పుడు కేసులు పెడితే ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకోవడం పొరపాటు. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టు ముందు హాజరు పరచాలి. ఎప్పుడో పట్టుకుంటారు.  24 గంటల ముందు పట్టుకున్నట్టు రికార్డుల్లో నమోదు చేస్తారు. ఇదంతా మాకు తెలియదు అనుకుంటున్నారా..? తప్పుడు కేసులతో మీరు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదు. ఇప్పుడు తెచ్చిన కేసులో కూడా గాయాలను ధ్రువీకరించే సర్టీఫికెట్‌ లేదు. అయినా 19 మంది మీద హత్యాయత్నం కేసు పెట్టారు.. ఇలా చేయడం ఎంత వరకు న్యాయం’’ అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.

నిందితుల వైద్య పరీక్షలకు ఆదేశం
పోలీసులు కొట్టడంతో చేతులు, కాళ్లకు గాయాలైనట్టు న్యాయమూర్తికి చూపించిన ఆరుగురు నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి,  మరొక్కసారి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి సీల్డు కవర్లో రిపోర్టులు పంపించాలని ఆదేశించారు. ఆసుపత్రికి తరలించే బాధ్యతను నిందితులపై కేసు పెట్టిన తిరుచానూరు పోలీసులకు కాకుండా తిరుపతి వెస్ట్‌ పోలీసులకు అప్పగించారు.  దీంతో సోమవారం రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత నిందితులను తిరిగి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అనంతరం 13 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించిన న్యాయమూర్తి వారిని కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.

ప్రత్యరి్థవర్గంపై బెయిలబుల్‌ కేసు నమోదు 
ఈ వ్యవహారంలో ప్రత్యర్థి వర్గంపై పోలీసులు నామమాత్రపు కేసులు బనాయించి చేతులు దులుపుకున్నారు. ఈ కేసులో ఫిర్యాదు దారుగా వచ్చిన దుర్వాసులు రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదుచేసిన పోలీసులు, ఆయనపై దాడికి పాల్పడిన ప్రత్యర్థి వర్గంపై బెయిలబుల్‌ కేసులు పెట్టి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.   

ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు: బాధిత కుటుంబాలు 
పోలీసు అధికారులపై ప్రైవేటు కేసు వేయడంతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత కుటుంబీకులు వెల్లడించారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వారిని కూడా హత్యాయత్నం కేసులో ఇరికించిన ఆధారాలను హైకోర్టుకు  నివేదించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement