350 సార్లు తిరుమల మెట్లు ఎక్కిన శ్రీవారి భక్తుడు

Tirumala Balaji Devotee Mahanti Srinivasa Rao Sets Record in Climbing Seven Hills - Sakshi

780 మందితో తిరుమల పాదయాత్ర

ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

శ్రీకాకుళం భక్తుడు మహంతి శ్రీనివాస్‌ ఘనత

శ్రీకాకుళం కల్చరల్‌: ఏడుకొండల వారిని ఒక్క క్షణం కళ్లారా చూడాలని కోట్లాది మంది మొక్కుతుంటారు. రెండు ఘడియల పాటు స్వామిని చూసే అవకాశం వస్తే జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అలాంటిది ఆయన 350 సార్లు తిరుమల మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ప్రతి మెట్టు పరిచయమే అన్నట్లు ప్రతినెల కాలినడకన తిరుపతి కొండ ఎక్కడం అలవాటుగా మార్చుకున్నారు. తాను వెళ్లడమే కాదు 780 మందితో తిరుమలకు పాదయాత్ర కూడా చేసి గోవిందుడి ఆశీస్సులు పొందారు. పాదయాత్రలకు గాను ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించుకున్నారు. ఆయన పేరు మహంతి శ్రీనివాస్‌. ఊరు శ్రీకాకుళం. 
 

గోవింద వరల్డ్‌వైడ్‌ వాట్సాప్‌ గ్రూపు..
 
శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాస్‌కు తిరుమలేశుడంటే ఎనలేని భక్తి. ఇప్పటివరకు 350 సార్లు తిరుపతి మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు.  సెప్టెంబరు 6వ తేదీ ఏకాదశి పర్వదినాన 780 మందితో గ్రూపుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకోసం ‘గోవింద వరల్డ్‌వైడ్‌’ వా ట్సాప్‌ గ్రూపును రూపొందించారు. అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా చేరారు. ఈ గ్రూపులో జూన్‌ 25లోగా సెప్టెంబరు 6న మెట్ల మార్గం ద్వారా పాదయాత్రకు ఆసక్తి ఉన్న వారు తమ సమ్మతిని తెలపాలని కోరారు.

సమ్మతి తెలిపిన వారు తిరుమలకు 5వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు హాజరు కావాలని సూచించారు. దీంతో కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ, ఒడి శా రాష్ట్రాల నుంచి 780 మందితో పాదయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆ రోజు సాయంత్రం గోవిందరాజస్వామి దర్శనాలు, శ్రీపద్మావతి అమ్మ వారి దర్శనాలు చేసుకున్నాక, రాత్రి తిరుపతిలో బస చేసి, 6వ తేదీ ఉదయం 6 గంటలకు మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర ప్రారంభించారు. 2388 మెట్లను 150 నిమిషాలు నడచి తిరుమల చేరుకున్నారు. ఇది ఆయన 350వ పాదయాత్ర.  
 
ఆ దారిలోనే..  
తిరుమల వెళ్లే భక్తులు సాధారణంగా ముందుగా తిరుమల వరకు నేరుగా వెళతారు. కానీ దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని శ్రీనివాస్‌ అంటారు. తిరుమల వెళ్లే భక్తులు ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక.. కొండపైకి చేరుకొని తలనీలాలు సమర్పించి, పుష్కర స్నానం చేసి ఆ తర్వాత వరాహ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలి. అలాగే కొండపై ఉన్న 6 ముఖ్యమైన ప్రదేశాలను దర్శించుకున్న తర్వాత యాత్ర పూర్తి అవుతుందని ఆయన చెబుతుంటారు.  
 
350 సార్లు ఇలా.. 
1996లో మొదటిసారిగా పాదయాత్ర ప్రారంభించారు. 1996 నుంచి 2016 వరకు 85 సార్లు వెళ్లారు. 2017లో ఆయన వయసు 50 ఏళ్లు ఆ ఏడాదే 50 సార్లు పాదయాత్ర చేశారు. 2018లో 71 సార్లు, 2019లో 50 సార్లు, 2020లో రెండు సార్లు(ఆ సమయంలో కరోనాతో గుడి మూసివేశారు). 2021లో 52 సార్లు, 2022లో 8 సెప్టెంబరుæ వరకు 40 సార్లు పాదయాత్ర నిర్వహించారు. మొత్తంగా 350 దఫాలు మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఇలా ఒకరోజులో ఒకసారిగా వెళ్లింది 193 సార్లు, ఒకరోజులో 2 సార్లు నడచింది 142సార్లు, ఒక రోజులో మూడుసార్లు నడిచింది 15 సార్లు కావడం విశేషం. ఆయనతో పాటు ఆయన భార్య కూడా 59 సార్లు, కుమారుడు కూడా 30 సార్లు పాదయాత్ర చేశారు. ఇప్పటికి 2వేల మంది భక్తులను తనతో పాటుగా తీసుకువెళ్లారు. 


ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం
 
తిరుమలలో పనిచేసిన జిల్లాకు చెందిన ఉన్నతాధికారి రుంకు అప్పారావు స్ఫూర్తితో శ్రీనివాస్‌ ఈ పాదయాత్రలు చేశారు. రుంకు అప్పారావు 108 సార్లు మెట్ల ద్వారా పాదయాత్ర చేసినందుకు గాను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు పొందారు.  అయితే శ్రీనివాస్‌ 2019 జనవరి 27 వరకు 205 పర్యాయాలు మెట్ల యాత్ర చేశాక ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించి యోగ్యతాపత్రాన్ని, గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. ఈ సర్టిఫికేటును అప్పటి ఈఓ అనిల్‌ సింఘాల్‌ చేతుల మీదుగా అందుకున్నారు. తిరిగి తన యాత్రను కొనసాగిస్తూ 258 పర్యాయాలు పూర్తి చేసినందుకు గాను 2020 మే8న ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అలాగే టీటీడీ నిర్వహిస్తున్న సప్తగిరి మాస పత్రికలో శ్రీనివాస్‌పై వ్యాసం కూడా ప్రచురించారు.   


ప్రతి నెలా వెళ్తా.. 

నేను ప్రతి నెల తిరుమల వెళ్లి మెట్ల దారి నుంచి స్వామి దర్శనం చేసుకుంటాను. ఇప్పటి వరకు 350సార్లు పాదయాత్ర చేశాను. తిరుమల అంటే సాక్షాత్తు వైకుంఠధామమే. తిరుమల యాత్ర ఏవిధంగా చేయాలో అందరికీ చెబుతాను. ఎప్పటికప్పుడు తిరుమలలో జరిగే తాజా మార్పులను వాట్సాప్‌ గ్రూపు ద్వారా అందరికీ చేరవేస్తుంటాను. స్వామిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.
– మహంతి శ్రీనివాస్, శ్రీకాకుళం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top