
కరోనా కాలంలో శానిటైజర్ విరివిగా దొరుకుతుండడంతో మత్తు కోసం వాటిని ఆశ్రయిస్తున్నారు.
సాక్షి, కడప: మద్యానికి బానిసలై చివరికి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. కరోనా కాలంలో శానిటైజర్ విరివిగా దొరుకుతుండడంతో మత్తు కోసం వాటిని ఆశ్రయిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండల కేంద్రంలో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి చెందారు. మృతులను చెన్నకేశవులు, భీమయ్య, ఓబులేష్‌లుగా గుర్తించారు. వీరిలో చెన్నకేశవులు ఇంటి వద్దనే మృతి చెందగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఖననం చేశారు.
ఓబులేష్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. భీమయ్య ఇంటి దగ్గరే చనిపోవడంతో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. వీరు మొత్తం 8 మంది బ్యాచ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ కలిసే శానిటైజర్ సేవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన ఐదుగురి ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. (వైఎస్సార్ జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు)