చంపుతానని బెదిరింపులు..పరిటాల శ్రీరామ్‌పై పోలీసులకు ఫిర్యాదు

Thopudurthi Chandrasekhar Reddy Slams on Paritala Sriram At Anantapur - Sakshi

వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి

చిలమత్తూరు: పరిటాల శ్రీరామ్‌ ఒక ఆకతాయి... ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఊతమిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) విమర్శించారు. ఆదివారం సాయంత్రం తన కాలర్‌ పట్టుకుని చంపుతానంటూ శ్రీరామ్‌ బెదిరించడంపై రామగిరి మండల వైఎస్సార్‌సీపీ నేత నసనకోట ముత్యాలు సోమవారం చిలమత్తూరు పోలీస్‌స్టేషన్‌లో చందుతో కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చందు మాట్లాడారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ నాయకులు బెదిరింపు ధోరణులకు పాల్పడుతుండడం సిగ్గుచేటన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలు..  వైఎస్సార్‌సీపీ తరఫున తిరుగుతుండడం జీర్ణించుకోలేక గతంలో దాడులు చేయించిన నీచ సంస్కృతి శ్రీరామ్‌దని గుర్తు చేశారు. తన ఐదేళ్ల పాలనలో లెక్కలేనన్ని పాపాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటు అడిగే ధైర్యం లేక ఇలాంటి రౌడీ మూకల్ని రంగంలో దించి, ప్రజలను బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.100 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన అల్లరి మూక శ్రీరామ్‌ను ప్రశాంతంగా జీవిస్తున్న చిలమత్తూరు మండల ప్రజలపైకి తోలి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం అరాచకాలు భరించలేక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 26వేల ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీని గెలిపించుకున్నారన్నారు. అంతటితో ఆగకుండా స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల్లోనూ పరిటాల కుటుంబాన్ని ఇంటికే పరిమితం చేసేలా ఓటర్లు తీర్పునిచ్చారన్నారు.

సొంత మండలం రామగిరిలో 9 పంచాయతీలకు గాను కేవలం రెండింటిని మాత్రమే పరిటాల కుటుంబీకులు నిలబెట్టుకున్నారంటే వారిపై ఎంత ప్రజావ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిలమత్తూరు మండల జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రమేష్, నాయకులు రామకృష్ణారెడ్డి, అమరనాథరెడ్డి, అశ్వత్థరెడ్డి, సోమశేఖర్, న్యాయవాది ఇందాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top