
దళితుడినైన నన్ను రాజకీయ రంగు పులిమి తీవ్రంగా వేధించారు
నా చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి
సీఎం, డీప్యూటీ సీఎంలకు లేఖ రాసిన తిరువూరు ఇరిగేషన్ ఏఈ
తిరువూరు: సీనియారిటీ, స్థానికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పచ్చనాయకుల సిఫార్సుల మేరకు కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేపట్టిన బదిలీలకు ఉద్యోగులు బలైపోతున్నారు. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికిన చందంగా.. ఉద్యోగుల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు దళిత ఉద్యోగినైన తనను వేధింపులకు గురి చేశారని, భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దళితుడైన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.కిషోర్ శుక్రవారం సీఎం, డిప్యూటీ సీఎంలకు లేఖ రాశారు.
తనను తిరువూరు నుంచి గౌరవరం ఎన్‌ఎస్‌సీ సెక్షన్‌కు బదిలీ చేసిన అధికారులు రిలీవ్ చేయలేదని, దీనిపై ఎమ్మెల్యేను పలుమార్లు కోరినా ఫలితం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయవాడ స్పెషల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గంగయ్య, కంచికచర్ల స్పెషల్ సబ్ డివిజన్ డీఈఈ ఉమాశంకర్ కలిసి తనకు రాజకీయ రంగు పులిమి ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్యాంప్రసాద్‌కు తిరువూరు ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి తన బదిలీని నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రిలీవ్ చేయవద్దన్నారని స్వయంగా ఇంజినీర్ ఇన్ చీఫ్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అధికారులు, తిరువూరు ఎమ్మెల్యే కలిసి ఆడిన రాజకీయ నాటకంలో తాను బలైపోయానని, తన చావుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఏ ఉద్యోగీ తనలా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూడాలని లేఖలో కోరారు. ఇరిగేషన్ అధికారుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు.