డిసెంబర్‌లో ఓబీసీ మహాగర్జన

Telugu States BC Associations Meets Central Law Minister Virendra Kumar - Sakshi

కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌తో బీసీ సంఘాల భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ డిమాండ్‌ చేసింది. ఇందుకోసం డిసెంబర్‌ మొదటివారంలో ఢిల్లీలో ఓబీసీ మహాగర్జన నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం తెలంగాణ భవన్‌లో మహాసంఘ్‌ జాతీయ అధ్యక్షుడు బాబాన్‌రావు తేవాడే అధ్యక్షతన సమావేశం జరిగింది. జనగణనలో కులాల వారీగా లెక్కలు తీయాలని, నీట్‌లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని కోరారు. అలాగే క్రీమిలేయర్‌ ఆదాయ పరిమితిని పెంచడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఇలా మొత్తం 8 డిమాండ్లకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీసీ సంఘాల అధ్యక్షులు కేసన శంకరరావు, జాజుల శ్రీనివాస్‌గౌడ్, 24 రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. 

క్రీమిలేయర్‌ను రద్దు చేయండి
క్రీమిలేయర్‌ను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆదాయ పరిమితిని 8 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలని బీసీ ప్రతినిధుల బృందం.. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. అలాగే దేశంలోని జాతీయ ప్రాజెక్టులు, పార్కులు, పర్యాటక స్థలాలకు మహాత్మ జ్యోతిబా పూలే పేరు పెట్టాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి విన్నవించింది. కాగా.. యూజీ, పీజీ వైద్య విద్య సీట్ల కేటాయింపుల్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఓబీసీ ఫెడరేషన్‌ జాతీయ కార్యదర్శి జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో పలువురు ఎంపీలను కలిసి ఆయన వినతిపత్రం అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top