వేడుకగా హంస పురస్కారాల ప్రదానం

Telugu and Sanskrit Academy presents Kala Ratna awards to nine individuals for their contribution to Telugu language literature - Sakshi

 వివిధ విభాగాల్లో తొమ్మిదిమంది ప్రముఖులకు సన్మానం

రాజానగరం: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో హంస పురస్కారాల ప్రదాన కార్యక్రమం మంగళవారం వేడుకగా జరిగింది. తెలుగు భాషాభివృద్ది కి విశిష్ట సేవలందిస్తున్న తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం  నిర్వహించారు.

ఈ సందర్భంగా తొమ్మిది మందికి హంస పురస్కారాలు ప్రదానం చేశారు.వీరిలో సాహిత్యంలో ఎస్‌.అబ్దుల్‌ అజీజ్‌ (రచయిత, కర్నూలు), మెడుగుల రవికృష్ణ (ఉపాధ్యాయుడు, గుంటూరు), డాక్టర్‌ జడా సుబ్బారావు (అసిస్టెంట్‌ ప్రొఫెసర్, నూజివీడు), వైహెచ్‌కే మోహనరావు (విలేకరి, పిడుగురాళ్ల), సామాజిక రచనలో ఎండపల్లి భారతి (రచయిత్రి, చిత్తూరు), కవిత్వంలో మాడభూషి సంపత్‌కుమార్‌ ఆచార్యులు (నెల్లూరు), అవధానంలో సూరం శ్రీనివాసులు (రిటైర్డ్‌ హెచ్‌ఎం, నెల్లూరు), సాంకేతిక రచనలు డాక్టర్‌ కేవీఎన్‌డీ వరప్రసాద్‌ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్, రాజమహేంద్రవరం) ఉన్నారు.

వ్యాసరచన పోటీల్లో గండికోట హిమశ్రీ (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు), జస్మితరెడ్డి (మంగళగిరి)లకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి,‘నన్నయ’ వీసీ ఆచార్య పద్మరాజు, సాహితీవేత్త, సంఘ సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త శలాక రఘునాధశర్మ, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. సుధాకర్‌ ప్రసంగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top