AP: ఆర్బీకేలు అద్భుతం.. కళ్లారా చూశా.. చాలా బాగున్నాయ్‌

Telangana Minister Niranjan Reddy Praises Rythu Bharosa Centres - Sakshi

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

‘ఏపీలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల గురించి చాలా కాలంగా వింటున్నాం. ఇవి చాలా బాగున్నాయని.. రైతులకు విశేష సేవలందిస్తున్నాయని తెలిసి ఓ సారి కళ్లారా చూద్దామని వచ్చా. వీటిద్వారా రైతులకు అందుతున్న సేవలు నేను ఊహించిన దానికంటే చాలా బాగా అందుతున్నాయి. ఆర్బీకేలు ఓ వినూత్నమైన విధానం.’ 
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ

సాక్షి, అమరావతి: ఏపీలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను, ఇక్కడ వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణలోని రైతు వేదికల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు త్వరలోనే ప్రతిపాదనలు రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిస్తామని, ఆయన అనుమతితో రైతు వేదికలను రైతు సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. గుంటూరులో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన తెనాలి మండలం మున్నంగి–1 ఆర్బీకేను సందర్శించారు. అనంతరం అత్తోట, నంది వెలుగు గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతులతో ముచ్చటించారు.

అక్కడి రైతులు పాటిస్తున్న సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవలపైనా ఆరా తీసారు. ఆర్బీకేల ఏర్పాటు లక్ష్యం ఏమిటి, ఇవా ఎలా పనిచేస్తున్నాయి, ఒక్కో ఆర్బీకేలో ఎంతమంది సిబ్బంది ఉంటారు. వారు ఎలాంటి సేవలందిస్తున్నారు, రైతుల కోసం ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తున్నారనే వివరాలను మున్నంగి–1 ఆర్‌బీకే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ‘ఆర్బీకే ఓ వినూత్నమైన విధానం. రైతులకు సంబంధించిన అన్ని సేవలు ఒకేచోట (వన్‌స్టాప్‌ షాప్‌లో) లభిస్తున్నాయి’ అంటూ అక్కడి విజిటర్స్‌ రిజిస్టర్‌లో తన అభిప్రాయాన్ని రాశారు. తెనాలి ఏడీ బత్తుల శ్రీకృష్ణ దేవరాయులు, ఆర్బీకే వీఏఏ, వీహెచ్‌ఏలు ఆర్బీకేల పని తీరును మంత్రికి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలపై తన మనోగతాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి  ‘సాక్షి’తో సోమవారం పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే..

మా రైతులకూ ఇదే తరహా సేవలందిస్తాం
‘మా రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన రైతు వేదికలను అభివృద్ధి చేసే విషయంలో మా ఆలోచన మాకుంది. వాటికి ఏపీలోని ఆర్బీకేల సాంకేతికత ఏ మేరకు తోడ్పడుతుందో పరిశీలిస్తున్నాం. రైతు వేదికలకు మరింత సాంకేతిక జోడించి అత్యుత్తమ సేవలందించడం ద్వారా నిత్యం క్రియాశీలకంగా ఉండేలా రైతులకు అందుబాటులో తీసుకురావాలన్నది మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. ఆయన సంకల్పం మేరకు రైతు వేదికల ద్వారా రైతులకు మెరుగైన సేవలందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఇక్కడ పరిశీలించిన అంశాలన్నిటిపైనా త్వరలోనే ప్రతిపాదనలు రూపొందించి కేసీఆర్‌కు నివేదిస్తాం. ఆర్బీకేల తరహాలో తెలంగాణ రైతు వేదికలను రైతు సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తాం. 

కళ్లారా చూశా.. చాలా బాగున్నాయ్‌
మా రాష్ట్రంలో రైతు వేదికలు కట్టి రైతులకు శిక్షణ ఇస్తున్నాం. కానీ.. ఆర్బీకేల స్థాయిలో మా దగ్గర సేవలందించడం లేదు. ఇక్కడి రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘వన్‌స్టాప్‌ షాప్‌’ కింద ఆర్బీకేల ద్వారా అందుబాటులోకి తెచ్చారు. రైతుల కోసం ప్రత్యేకంగా ఓ చానల్‌ సైతం నడుపుతున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ టీవీ ద్వారా రైతులు స్వయంగా వీక్షించేలా ఏర్పాటు చేశారు. కియోస్క్‌ టెక్నాలజీ ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు బుక్‌ చేసుకున్న కొద్ది గంటల్లోనే పంపిణీ చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. దారి మధ్యలో అత్తోట, నంది వెలుగు గ్రామాల్లోని పొలాల దగ్గర ఆగి రైతులతో మాట్లాడా. వాళ్లు ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఆర్బీకేలను, వాటి ద్వారా రైతులకు అందుతున్న సేవలను కళ్లారా చూశా.. ఆర్బీకేలు చాలా బాగున్నాయ్‌. ఈ వినూత్న ప్రయోగం ద్వారా అందిస్తున్న సేవలతో రైతులు పూర్తిగా ప్రభుత్వంతో ఉన్నారని నా పరిశీలన లో అర్థమైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top