
తిరువూరులో బారికేడ్లను తోసేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
స్థానిక ఎన్నికల్లో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, శ్రేణులు
తిరువూరులో వీధి రౌడీలా రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొలికపూడి
మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి
నరసరావుపేట, కారంపూడిలో దౌర్జన్యకాండ.. గ్రేటర్ విశాఖలో జనసేనకు టీడీపీ ఝలక్
యలమంచిలి ఎంపీపీ సహా పలుచోట్ల వైస్‌చైర్‌పర్సన్లుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎన్నిక
స్థానిక ఎన్నికల్లో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, శ్రేణులు
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ సహా వివిధ మున్సిపల్ చైర్‌పర్సన్లు, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, 20 పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవుల కోసం సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ.. అక్రమాల జాతర నడిపించారు. తిరువూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి మంగళవారానికి వాయిదా వేశారు.
నరసరావుపేట, కారంపూడిలో దొడ్డిదారిన..
నరసరావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రెండుసార్లు ఎన్నిక నిర్వహించగా కోరం లేక వాయిదా పడింది. మూడోసారి సోమవారం ఎన్నిక నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి టీడీపీ తరఫున ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా ప్రత్యేక సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది.
మూడోసారి నిర్వహిస్తున్న ఎన్నిక సమావేశం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి ప్రత్యేక అధికారాన్ని వినియోగించి.. సమావేశానికి ఎన్నికైన ముగ్గురు ఎంపీటీసీల్లో కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. కాగా.. కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా టీడీపీ బలపరిచిన గాడిపర్తి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇక్కడ 14 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుని దాడులు చేశారు. భయానక వాతావరణం సృష్టించి టీడీపీ ఈ పదవిని తన ఖాతాలో వేసుకుంది.
ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడి..
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల రాజకీయం చేసింది. పదవులు, డబ్బు ఎరగా వేసి.. వినని వారిని కేసులతో భయపెట్టి తమ వైపు ఓటు వేయించుకుంది. గాండ్లపెంట మండలంలో టీడీపీకి కేవలం ఒక్క ఎంపీటీసీ మాత్రమే ఉండగా.. డబ్బులు ఎరవేసి ముగ్గురు ఎంపీటీసీలను తనవైపు తిప్పుకుంది. పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఎంపీపీ పదవి కట్టబెట్టింది. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థి లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి కుట్రలకు బలైంది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబీ నాయన ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి టీడీపీ వైపు తిప్పుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో రాంబార్కి శరత్ ఎన్నికయ్యారు.
గ్రేటర్ విశాఖలో జనసేనకు ఝలక్
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేన పారీ్టకి టీడీపీ కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. ఈ పదవి జనసేనకు ప్రకటించడంతో పలువురు టీడీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకాకుండా షాకిచ్చారు. గత నెల 28న నిర్వహించిన మేయర్ ఎన్నికకు 74 మంది సభ్యులు హాజరుకాగా.. సోమవారం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు కేవలం 54 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నిక ప్రత్యేక సమావేశానికి 56 మంది సభ్యులు హాజరుకావాలి. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు.
యలమంచిలి ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం
రెండు నెలలపాటు అధికార పార్టీ అక్రమ కేసులు, తీవ్రస్థాయి బెదిరింపులు, మానసిక వేధింపుల్ని తట్టుకుని వైఎస్సార్‌సీపీలోనే కొనసాగిన ఎంపీటీసీ ఇనుకొండ ధనలక్ష్మి పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీకి బలం లేకపోయినప్పటికీ అత్తిలి ఎంపీపీ స్థానాన్ని, కైకలూరు వైస్ ఎంపీపీ స్థానాన్ని బెదిరింపులతో దక్కించుకుంది. అత్తిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చిల్లర రాజకీయాలకు తెగబడ్డారు. ఆపార్టీ తీవ్రస్థాయి బెదిరింపులతో కొందరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీలో చేర్చుకుని అత్తిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఆ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ జయకేతనం
ప్రకాశం జిల్లా మార్కాపురం, త్రిపురాంతకం మండల ఉపాధ్యక్షుల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మార్కాపురం వైస్ ఎంపీపీ–2గా కుందురు మల్లారెడ్డి, త్రిపురాంతకం వైస్ ఎంపీపీగా పాటిబండ్ల కృష్ణ ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఎనుముల సోమశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె రెండో వైస్ ఎంపీపీగా చెర్లోపల్లె వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అనసూయమ్మ ఎన్నికయ్యారు.