టీడీపీ నేతల కీచకపర్వం.. నిందితులకు ‘పరిటాల’ వత్తాసు! | TDP Leaders Hulchul At Sathya Sai District | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల కీచకపర్వం.. నిందితులకు ‘పరిటాల’ వత్తాసు!

Jun 7 2025 9:03 AM | Updated on Jun 7 2025 3:00 PM

TDP Leaders Hulchul At Sathya Sai District

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : దళిత మైనర్‌ బాలికపై ఆరు నెలలుగా 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకులు సాగించిన ఈ దారుణకాండను శుక్రవారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అమానుష ఘటన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

రాజకీయ, పోలీసు వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమైంది. ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు ముందుగానే తెలిసినా, ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చే వరకు స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి కథనంతో ఈ ఘోరం బయటి ప్రపంచానికి వెల్లడైంది. నిందితుల్లో తొమ్మిది మందిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారణ కోసం అంటూ రామగిరి నుంచి ధర్మవరం తీసుకెళ్లినట్లు సమాచారం. వీరిని ఎక్కడ పట్టుకున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించ లేదు. దాదాపుగా నిందితుల పేర్లన్నీ ఇప్పటికే బయటకు వచ్చినా, ఎందుకు ముందుగానే అదుపులోకి తీసుకోలేకపోయారనేది అనుమానాలకు తావిస్తోంది.

టీడీపీ ప్రముఖ నేతల జోక్యంతో కేసును, నిందితులను తారుమారు చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే నిందితులు దాక్కున్నట్లు సమాచారం. వీడియో వైరల్‌ చేస్తామని బెదిరించి మైనర్‌ బాలికపై 14 మంది టీడీపీ వర్గీయులు ఆర్నెల్ల పాటు అత్యాచారం సాగించారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు పొక్కింది. అయితే బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా నిందితులు తీవ్రంగా బెదిరించారు. దీంతో గురువారం మధ్యాహ్నమే సదరు బాలిక.. తల్లితో కలిసి గ్రామం వదిలి వెళ్లిపోయారు. వారు ఒక టీడీపీ నేత ఇంట్లో ఉండగా.. పోలీసులు ఆ బాలికతో మాట్లాడినట్లు సమాచారం.  

నీకెవరూ దిక్కు లేరంటూ.. 
బాధిత బాలికను జిల్లా ఎస్పీ వి.రత్న నేతృత్వంలో ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం విచారించినట్లు తెలిసింది. విచారణలో బాలిక విస్తుగొలిపే వాస్తవాలు చెప్పినట్లు సమాచారం. 14 మందీ అదే గ్రామానికి చెందిన టీడీపీ వారేనని వివరించినట్లు తెలిసింది. మొదట ఒకరు బెదిరించి, అత్యాచారానికి పాల్పడి.. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడని, ఆ తర్వాత ఆ వీడియోను ఇతరులకు పంపారని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆ వీడియో పేరుతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ అమానుషానికి పాల్పడ్డారని కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. ఇలా దాదాపు ఆరు నెలలుగా అత్యాచా­రం చేశారని ఎస్పీ విచారణలో బాలిక వెల్లడించినట్లు సమా­చారం.

‘ఎవరికైనా చెబితే చంపేస్తాం. నీకు తండ్రి లేడు. తల్లికి మతి స్థిమితం లేదు. నీకెవరూ దిక్కు లేరు. మేం చెప్పినట్లు వినకపోతే నీ వీడియోలు బయట పెడతాం అని బెదిరించే వారు. అవి చూపుతూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంతగా బతిమాలినా వదిలి పెట్టేవాళ్లు కాదు. ఏం చేయాలో తోచేది కాదు. దొంగగా ఏడ్చుకోవాల్సి వచ్చేది. దీంతో నాకు చాలా సార్లు చనిపోవాలనిపించింది. అయితే అమ్మ పరిస్థితి చూసి ఆ పని చేయలేకపోయాను’ అని బాధిత బాలిక తన నరకయాతనను పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికను జువైనల్‌ హోమ్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.    

నిందితులకు ‘పరిటాల’ వత్తాసు! 
సామూహిక అత్యాచారంలో పాల్గొన్నట్లు అనుమానం ఉన్న యువకులందరూ టీడీపీ సానుభూతిపరులే. దీంతో వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ రంగంలోకి దిగినట్లు తెలిసింది. వాస్తవానికి బాధిత బాలిక కుటుంబం కూడా టీడీపీలోనే కొనసాగుతోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత జరిగిన విజయోత్సవ సంబరాల్లో బాధిత బాలిక తండ్రి మరణించాడు. అయినప్పటికీ పరిటాల సునీత బాధిత బాలిక వైపు కాకుండా.. నిందితుల వైపు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇదిలా ఉండగా, శుక్రవారం ఏడుగుర్రాలపల్లిలో రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్‌ అధికారులు పర్య­టించారు. ఘటనకు సంబంధించి గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. బాధిత బాలికకు న్యాయం జరిగేవరకు పోరాడతామని దళిత సంఘం నాయకులు పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement