
సాక్షి, వైఎస్సార్: మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. అనంతరం, సెల్ టవర్ ఎక్కారు సదరు నాయకురాలు. దీంతో, భారీగా పోలీసులు.. అక్కడికి చేరుకుని ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.
మహానాడు సందర్బంగా చంద్రబాబుకు టీడీపీ మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి లేఖ రాశారు. లేఖలో తన మీనాక్షి తన ఆవేదనను వ్యక్తం చేశారు. టీడీపీ కోసం 20ఏళ్లుగా పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మాధవీ రెడ్డి గెలిచిన తర్వాత దళితురాలైన తనకు, ఇతర సీనియర్ కార్యకర్తలకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆమె గెలిచిన తర్వాత కనీసం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. మహానాడుకు తన లాంటి కరుడుగట్టిన టీడీపీ వారికి ఆహ్వానం లేకపోవడం బాధాకరమన్నారు.
టీడీపీకి ఎంతో సేవ చేసిన తమ లాంటి పార్టీ కార్యకర్తలను చంద్రబాబు, లోకేశ్ వరకూ రాకుండా మాధవీ రెడ్డి కోటరీ అడ్డుకుంటోందని ఆరోపణ చేశారు. నిజమైన కార్యకర్తలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో కడపలో పార్టీ మనుగడే కష్టమన్నారు. తన లాంటి కార్యకర్తల గోడు మీకు తెలియాలనే ఆత్మహత్యకు పూనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. కనీసం తన చావుతోనైనా మిగతా కార్యకర్తలకు న్యాయం చేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం, కడపలో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్ వద్దకు వెళ్లి.. టవర్ ఎక్కారు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ నేత ఇలాంటి చేయడం చర్చనీయాంశంగా మారింది.

