ప్రభుత్వ భూమిపై 'పచ్చ'గద్ద | TDP leader eyes on government land | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిపై 'పచ్చ'గద్ద

Jul 27 2025 6:01 AM | Updated on Jul 27 2025 6:01 AM

TDP leader eyes on government land

రూ. 5 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిపై టీడీపీ నేత కన్ను 

గత ప్రభుత్వంలో జగనన్న కాలనీకి కేటాయించిన భూమి కబ్జాకు యత్నం 

నాలుగు రోజుల క్రితం ట్రాక్టర్‌తో దున్నుతుండగా అధికారుల అడ్డగింత 

భూమిలోకి అడుగుపెడితే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరిక

అధికారంలో ఉన్నాం... తమకు ఎదురు లేదనుకున్నాడో ఏమో ఓ పచ్చ నేత బరితెగించాడు.ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పన్నాగం పన్నాడు. సెంటు, రెండు సెంట్లు కాదు ఏకంగా రూ. 5 కోట్లకు పైగా విలువ చేసే 3.80 ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించాడు. మొన్నటిదాకా ఎలాంటి అనుమతులు లేకుండా, ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యుల పేరు చెప్పుకుంటూ ఎర్రమట్టిని యథేచ్ఛగా     తరలించి ‘క్యాష్‌’ చేసుకున్న ఈయన... తాజాగా ప్రభుత్వ భూమిపై కన్నేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

రాప్తాడురూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం      కృష్ణంరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కందుకూరు పొలం 90–3 సర్వే నంబరులో 3.86 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో తహసీల్దార్‌ కార్యాలయంలో పని చేసిన ఓ అధికారి తన బినామీ పేరుతో 3.86 ఎకరాలకు నకిలీ ‘మిల్ట్రీ’ పట్టా తయారు    చేయించి రికార్డుల్లోకి ఎక్కించాడు. ఎవరి పేరుమీద పట్టా ఉందో ఆ వ్యక్తి ఇప్పటిదాకా తహసీల్దార్‌ కార్యాలయానికి కానీ, ఈ భూమివైపు కానీ తొంగిచూడలేదు.  దీంతో పట్టా రద్దుకు గత ప్రభుత్వంలో సిఫార్సు చేశారు. 

అలాగే, కృష్ణంరెడ్డిపల్లికి చెందిన పేదలకు ఇంటి పట్టాల కోసం ఈ భూమిలో ఎకరన్నర భూమిని ‘జగనన్న కాలనీ’కి కేటాయించారు. 48  మంది లబ్దిదారులకు ప్లాట్లు కేటాయించేలా స్కెచ్‌ కూడా తయారు చేశారు. లబి్ధదారులను ఎంపిక చేసి పట్టాలు తయారు చేసే క్రమంలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది.   

కూటమి ప్రభుత్వంలో పచ్చ నేత కన్ను.. 
ప్రభుత్వం మారగానే కృష్ణంరెడ్డిపల్లికి చెందిన ఓ చోటా నేత ఈ భూమిపై కన్నేసి కబ్జా చేసేందుకు పూనుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ట్రాక్టర్‌తో దున్ని చదునుచేసేందుకు వెళ్లాడు. ట్రాక్టర్‌తో అర ఎకరా వరకు దున్నాడు. ఇంతలో సమాచారం     అందుకున్న రెవెన్యూ అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. భూమి తమదేనంటూ పచ్చ నేత బుకాయించే ప్రయత్నం చేశాడు. అధికారులు తిరగబడడంతో మెత్తబడ్డాడు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి, ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే సీరియస్‌గా పరిగణిస్తామని హెచ్చరించారు.  

కుప్పలుగా నకిలీ పట్టాలు.. 
గతంలో కొందరు రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ‘మిల్ట్రీ’ పట్టాల పేరుతో పెద్ద ఎత్తున దందా చేశారు. ‘మిల్ట్రీ’ పట్టాల పంపిణీలో కనీస నిబంధనలు పాటించలేదు. ఎవరో ఒకరిమీద.. అదికూడా పదేళ్ల కిందటే మిల్ట్రీ పట్టా పుట్టించి వాటిని రికార్డుల్లోకి ఎక్కించేందుకు కొందరు బాగా సహకరించారు.పదేళ్లు పూర్తికావడంతో వారి నుంచి మరొకరు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్మకాలకు తెర తీశారు. ఈ ముసుగులో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట, ఉప్పరపల్లి, కందుకూరు, కొడిమి, ఎ.నారాయణపురం సర్వే           నంబర్లలో నకిలీ పట్టాదారులు ఎక్కువగా ఉన్నారు. 

మాజీ సైనికులకు ప్రభుత్వ భూమి కేటాయించాలంటే ముందుగా సైనిక సంక్షేమశాఖ నుంచి పేర్లు కలెక్టర్‌కు సిఫార్సు చేయాలి. కలెక్టర్‌ పరిశీలించి   సంబంధిత మండలాల తహసీల్దార్లను ఆదేశిస్తారు. వారు తమ పరిధిలో ప్రభుత్వ భూములను    గుర్తించి తిరిగి కలెక్టర్‌కు.. అక్కడి నుంచి సైనిక    సంక్షేమశాఖ అధికారులకు పంపుతారు. ఆ తర్వాత కలెక్టర్‌ ఆదేశాల మేరకు భూములను అర్హులైన మాజీ సైనికులకు ‘అసైన్డ్‌’ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ ఎక్కడా లేకుండానే కొందరు ఘనులు పట్టాలిచ్చారు. ‘మిల్ట్రీ’ పట్టా భూములపై లోతుగా విచారణ జరిపితే అక్రమాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తాయని స్వయంగా రెవెన్యూ అధికారులు చెబుతుండడం గమనార్హం. 

ఉరవకొండలో బరితెగింపు
ఉరవకొండ: అధికార అండ చూసుకుని తమ్ముళ్లు బరి తెగిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. ఉరవకొండ పట్టణంలో      రూ.లక్షలు విలువ చేసే 20 సెంట్ల ప్రభుత్వ భూమిలో రాత్రికే రాత్రే జేసీబీల సాయంతో చదును చేసి పసుపు రంగు రాళ్లు పాతడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. ఉర­వకొండ శివరామిరెడ్డి కాలనీలోని సర్వే నం. 552లో 2023లో పేదలకు పట్టాలు ఇచ్చారు. ఇంకా కొంత స్థలం ఖాళీగా ఉంది. కూటమి ప్రభు­త్వం వచ్చాక స్థానిక టీడీపీ నాయకులు ఈ స్థలంపై కన్నేశారు. 

నకలీ పట్టాలు సృష్టించుకుని ఇటీవల అందులోకి చొరబడ్డారు. హద్దుల రాళ్లు పాతి వాటికి పసుపు రంగు కొట్టారు. గతంలో ఉరవ   కొండ పట్టణానికి చెందిన ఓ ప్రయివేట్‌ సర్వేయర్‌ సాయంతో నకలీ పట్టాలు సృష్టించినట్లు తెలుస్తోంది. గతంలో శివరామిరెడ్డి కాలనీలోనే సదరు సర్వేయర్‌ అనేక నకలీ పట్టాలు తయారు చేసి లక్షలాది రూపాయలు దోచుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. 

ఆయనకు ఏమాత్రం సంబంధం లేదు
కృష్ణంరెడ్డిపల్లి సమీపంలో 90–3 సర్వే   నంబరులోని ప్రభుత్వ భూమి­ని చదును చేస్తున్నారనే సమాచారంతో వెళ్లి పరిశీలించాం. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. చదును చేస్తున్న వ్యక్తికి, ఆ భూమికి ఏమాత్రం సంబంధం లేదు. వెంటనే ట్రాక్టర్‌ తీసుకుని భూమిలో నుంచి బయటకు పంపించాం. ఫారం–1,2 నోటీసులు జారీ చేశాం.  మళ్లీ భూమిలో కనిపిస్తే ట్రాక్టర్‌ను సీజ్‌ చేయడంతో పాటు వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయిస్తాం. – మోహన్‌కుమార్, తహసీల్దార్, అనంతపురం రూరల్‌ మండలం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement