గుట్టు రట్టుతో రాజీ డ్రామా..!

TDP Double Game Reveled In Abdul Salam Case - Sakshi

సలామ్‌ కేసులో టీడీపీ డబుల్‌ గేమ్‌ బహిర్గతం

పార్టీ పదవికి టీడీపీ న్యాయవాది వేదుర్ల రాజీనామా

వకాలత్‌ ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటన

నంద్యాల: కర్నూలు జిల్లాలో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్‌ సలాం కేసులో టీడీపీ రాజీ డ్రామాకు తెరతీసింది. ఈ కేసులోని నిందితులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ వేదుర్ల రామచంద్రారావు బెయిల్‌ ఇప్పించిన వైనాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఆయన ప్రకటించారు. ఒకవైపు నిందితులకు బెయిల్‌ ఇప్పించి మరోవైపు ఒక్కరోజులోనే ఎలా ఇస్తారంటూ టీడీపీ డబుల్‌ గేమ్‌ ఆడటాన్ని ‘బెయిలడిగేదీ వారే.. బురద చల్లేదీ వారే’ పేరుతో ‘సాక్షి’ వెలుగులోకి తేవడం తెలిసిందే. దీంతో టీడీపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.

తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ద్వారా బెయిల్‌ ఇప్పించిన విషయం బహిర్గతం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర నేతలు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎన్‌ఎండీ ఫరూఖ్‌ మౌనం దాల్చారు. ఈ నేపథ్యంలో  రామచంద్రారావు బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. తనవల్ల ఇంత చర్చ జరగడం ఇష్టం లేదని, ఈ కేసులో వకాలత్‌ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

నేడు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ
ఈ కేసులో నిందితుల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి మోకా సువర్ణరాజు గురువారం విచారణ జరపనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితుల తరపున వాదించిన టీడీపీ నేత రామచంద్రారావు వకాలత్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top