టీడీపీకి మహానాడు జాకీలు

TDP Activists No Response To Chandrababu Mahanadu Speech - Sakshi

పాతాళానికి పడిపోయిన పార్టీని నిలబెట్టే ప్రయత్నం

బాబు పిలుపులకు స్పందించని నేతలు, శ్రేణులు

మూడేళ్లుగా బయటకే రాని పలువురు నేతలు

యువతకు అవకాశం పేరుతో జూనియర్లను తెచ్చే యత్నం

బూతులమయంగా మహానాడు

జగన్‌ లక్ష్యంగా ఇష్టారీతిన మాట్లాడిన నేతలు

తిట్లు, శాపనార్ధాలతోనే 15 తీర్మానాలు

ఎన్టీఆర్‌కు భారతరత్న కోరుతూ తీర్మానమే లేదు  

సాక్షి, అమరావతి: పాతాళానికి పడిపోయిన తెలుగుదేశం పార్టీని కొద్దిగానైనా పైకి లేపి రాజకీయ రేసులో ఉన్నామని చెప్పుకొనేందుకు చంద్రబాబు మహానాడు ద్వారా తాపత్రయపడ్డారు. నిస్తేజంలో కూరుకుపోయిన శ్రేణులు, భవిష్యత్తుపై బెంగతో అస్త్ర సన్యాసం చేసిన నాయకుల్ని కదిలించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థానిక ఎన్నికల్లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస పోటీ కూడా ఇవ్వలేక దారుణంగా ఓడిపోవటంతో పార్టీ యంత్రాంగం నీరసించిపోయింది. చంద్రబాబు ఎన్ని పిలుపులు ఇచ్చినా నాయకులు, శ్రేణులు పట్టించుకోలేదు.

సోషల్‌ మీడియా ద్వారా ఏదో ఉన్నామని చూపించుకోవడం తప్ప పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించే పరిస్థితి లేకుండాపోయింది. మెజారిటీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలు కూడా లేరు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హవా చెలాయించిన నేతలు, మంత్రుల్లో నలుగురైదుగురు మినహా మిగిలిన వాళ్లెవరు మూడేళ్లుగా బయటకు రాలేదు. దీంతో కొంత కాలంగా యువతకు అవకాశం పేరుతో జూనియర్‌ నాయకులను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు ద్వారా పార్టీ శ్రేణుల్ని కొంతైనా కదిలించాలని ప్రయత్నించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బూతులు, తిట్లు
పార్టీ ముందడుగు కోసం నిర్వహించే మహానాడు వేదికను పూర్తిగా బూతులమయంగా మార్చివేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని నోటికి వచ్చినట్లు కొందరు నేతలతో మాట్లాడించడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని వ్యతిరేకించి అభూత కల్పనలతో బురద జల్లేందుకు మహానాడును ఉపయోగించుకున్నారు. అందులో భాగంగానే ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు చేసి ప్రతి దాన్ని తిట్లు, శాపనార్థాలతో నింపేశారు.

మరోవైపు మహానాడు ముగింపు సభకు కార్యకర్తలు రారనే భయంతో మహానాడును అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు వారం ముందు నుంచే తప్పుడు ప్రచారానికి దిగారు. బస్సులు ఇవ్వడంలేదని ఆరోపణలు చేశారు. చంద్రబాబు, ఇతర నేతలు టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి నియోజకవర్గాల వారీగా నాయకులకు టార్గెట్లు ఇచ్చి కచ్చితంగా అంతమందిని ఒంగోలుకు తీసుకురావాలని ఆదేశించారు. అంతమందిని తేలేమని చాలామంది చేతులెత్తేయడంతో జనం రారనే భయంతో మహానాడును అడ్డుకుంటున్నారంటూ ముందస్తుగా ప్రచారాన్ని లేవనెత్తారు.

ఎన్టీఆర్‌కు దక్కని సముచిత గౌరవం
ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ మహానాడులో ఆయనకు మాత్రం సముచిత గౌరవం ఇవ్వలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రతి మహానాడులో తీర్మానం చేస్తున్నారు. అయితే, ఆయన శత జయంతి సందర్భంగా నిర్వహించిన మహానాడులో ఈ తీర్మానమే లేదు. ఆయన పేరును చెప్పుకోవడానికే నేతలు పరిమితమయ్యారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడం తప్ప ఆయన్ను గౌరవించేలా ఒక్క పనీ చేయలేదు. వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ను గౌరవించే విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించింది. సీఎం జగన్‌ తాను ఇచ్చిన హామీ మేరకు విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టి గౌరవించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top