కారుమూరిని కోర్టుకు తరలిస్తున్న పోలీసులు
బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్
ఆయనపై పెట్టిన కేసుకు సంబంధించి.. అన్నీ బెయిలబుల్ సెక్షన్లే
అరెస్ట్ చేసే ముందు ఆయనను ప్రాథమికంగా విచారించాలి
అలా చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు
గుంతకల్లు, తాడిపత్రి టౌన్: ‘వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై పెట్టిన కేసుకు సంబంధించి అన్నీ బెయిలబుల్ సెక్షన్లే. ఆయనను అరెస్ట్ చేసేముందు ప్రాథమికంగా విచారించాలి. అలా చేయకుండా ఏకపక్షంగా అరెస్ట్ చేయడమేంటి’ అని పోలీసులను అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు నిలదీసింది. ఈ మేరకు వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
రెడ్‌బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడుతూ ప్రశ్నించే గళాలను అణచివేస్తున్న చంద్రబాబు సర్కారు బరి తెగించి వ్యవహæరిస్తోంది! సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేశారని.. టీటీడీ మాజీ ఏవీఎస్‌వో, గుంతకల్లు రైల్వే ఇన్‌స్పెక్టర్ సతీశ్‌కుమార్ అనుమానాస్పద మృతిపై రాజకీయ ప్రేరేపిత పోస్టులు పెట్టారంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేసింది.
తాడిపత్రికి చెందిన ఓ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో.. సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులమని చెబుతూ, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి గుంతకల్లు తరలించారు. దీనిపై కారుమూరి భార్య హరిత హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డీఎస్సీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల ఆందోళన
వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తాడిపత్రి పోలీసులు గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం 6.00 నుంచి 9.00 గంటల వరకు డీఎస్పీ ఏ.శ్రీనివాస్ తన చాంబర్‌లో కారుమూరిని విచారించారు. నాలుగు గంటల హైడ్రామా తర్వాత ఆయన్ను తాడిపత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. కారుమూరి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు డీఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చాయి. అనంతపురం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, కారుమూరి సోదరి సునీతారెడ్డి తదితరులు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.
పార్టీ లీగల్ సెల్ నాయకులు హరినాథ్‌రెడ్డి, ఉమాపతి, రాజశేఖర్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అక్రమ కేసు వివరాలను ఆరా తీశారు. కారుమూరు వెంకటరెడ్డిని కలిసేందుకు పోలీసులు ఏ ఒక్కరినీ అనుమతించకపోవడంపై పార్టీ నేతలు మండిపడ్డారు. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన టీడీపీ నేత, జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు చింబిలి ప్రసాద్ నాయుడు ఆదివారం తాడిపత్రి రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారుమూరిపై పోలీసులు 352, 353(1)(2)196 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాడిపత్రిలో ఉద్రిక్తత
కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన్ను హైదరాబాద్ నుంచి తాడిపత్రికి తరలిస్తున్నట్లు మీడియా ద్వారా తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కూకట్‌పల్లి పోలీసులకు కారుమూరి భార్య ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ పోలీసులమంటూ కొందరు వ్యక్తులు సివిల్ డ్రస్‌లో వచ్చి కారుమూరి వెంకటరెడ్డిని తీసుకువెళ్లారంటూ ఆయన భార్య హరిత కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 7 గంటల సమయంలో సివిల్ డ్రస్‌లో వచ్చిన నలుగురు వ్యక్తులు తన సెల్‌ఫోన్ లాక్కుని, తన భర్తను వారితో తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. విషయాన్ని పెద్దది చేస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని బెదిరించినట్లు వెల్లడించారు.
నిత్యం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ అరెస్టు: శ్యామల
మూసాపేట (హైదరాబాద్): రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయభ్రాంతులకు గురి చేసేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. కారుమూరి వెంకటరెడ్డి భార్య హరితతో కలసి మంగళవారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్న వారిని అరెస్టు చేయకుండా.. వాటిని ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలను నిత్యం ప్రశ్నిస్తున్నందుకే కారుమూరిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ వాహనాల్లో తరలించారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ధీటుగా ఎదుర్కొంటామని ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.


