నందిగామలో విషాదం.. విమానం ఎక్కాల్సిన యువకుడు అనుమానాస్పద మృతి!

Suspicious Death Of Youth At Nandigama In NTR District  - Sakshi

నందిగామ/వత్సవాయి: మరికొద్ది సేపట్లో ఉన్నత విద్య కోసం లండన్‌ బయలుదేరి వెళ్లవలసిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం నందిగామ శివారు హనుమంతుపాలెంకు చెందిన గాడిపర్తి వెంకటనారాయణ కొంతకాలంగా నందిగామ పట్టణంలో నివాసం ఉంటున్నారు. 

వెంకటనారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్నాడు. రెండవ కుమారుడు గాడిపర్తి శివకృష్ణ (24) గత ఏడాది బీటెక్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం బుధవారం తెల్లవారుజామున లండన్‌ బయలుదేరేందుకు హైదరాబాదు వెళ్లవలసి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో తన మిత్రులను కలిసి వస్తానని చెప్పి శివకృష్ణ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. బయటికి వెళ్లిన  శివకృష్ణ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. 

దీనికి తోడు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో  తల్లిదండ్రులు ఆందోళనతో మిత్రులను ఆరా తీశారు. అయినా ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నవాబుపేట సమీపంలోని పొలాల్లో చెట్టుకి ఉరివేసుకొని ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో అటుగా వచ్చిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే తమ కుమారుడి కోసం వెతుకుతున్న వెంకటనారాయణ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి మృతుడు శివకృష్ణగా గుర్తించారు. దీంతో వత్సవాయి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు 
లండన్‌ వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాల్సిన శివకృష్ణ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో బయలుదేరవలసిన తమ కుమారుడు ఎందుకు మృతి చెందాడో కూడా కుటుంబ సభ్యులకు అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. 

ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల పరామర్శ 
శివకృష్ణ మృతదేహానికి బుధవారం నందిగామ పట్టణంలో పంచనామా నిర్వహించారు. శివకృష్ణ మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఉన్నత చదువులకు లండన్‌ వెళ్లవలసిన శివకృష్ణ మృతి చెందడం బాధాకరమన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top