బాల్య వివాహాలపై నిఘా

Surveillance on child marriages Andhra Pradesh - Sakshi

మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ

బాల్య వివాహాల సమాచారం టోల్‌ఫ్రీ నంబర్‌ 1098, 181కి ఇవ్వాలని ప్రచారం

వివాహాలపై తల్లిదండ్రులతో విభేదించే బాలికలకు పునరావాసం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాలకు చెల్లుచీటి రాసేలా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే పక్కా కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, జిల్లా స్థాయి పిల్లల సంరక్షణ అధికారుల సమన్వయంతో ఇప్పటికే రంగంలోకి దిగింది. బాల్య వివాహాలపై అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి సమాచారం సేకరించి జిల్లా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు వేస్తోంది. బాల్య వివాహాలకు ఎవరైనా ప్రయత్నిస్తే ఆ సమాచారాన్ని స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు అందించేలా ప్రజల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1098, మహిళా సంరక్షణ టోల్‌ ఫ్రీ నంబర్‌ 181తోపాటు స్థానిక పోలీసులు, జిల్లా కేంద్రాల్లోని ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు.

బాల్య వివాహాలతో దుష్పరిణామాలెన్నో
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం బాల్య వివాహాల్లో  40 శాతం మన దేశంలోనే జరుగుతున్నట్టు గుర్తించారు. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం, మత, కులపరమైన కట్టుబాట్ల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో వివాహం చేయటం వల్ల వారిలో మానసిక పరిపక్వత లోపించటం, ఆరోగ్యపరమైన సమస్యలకు దారి తీస్తోంది. దేశంలో 15 నుంచి 19 ఏళ్లలోపు బాలికలు ఏటా దాదాపు 70 వేల మంది ప్రసవ సమయంలో మరణిస్తున్నట్టు అంచనా. మైనర్‌ బాలికలకు తక్కువ బరువుతో, పోషకాహార లోపంతో పిల్లలు పుడుతున్నారు. వారికి పుట్టే శిశువులు మరణిస్తున్న ఘటనలూ నమోదవుతున్నాయి.

ఏడాదిలో 1,235 బాల్య వివాహాలకు అడ్డుకట్ట
రాష్ట్రంలో గడచిన ఏడాది కాలంలో 1,235 బాల్య వివాహాలను అధికారులు నిరోధించారు. బాల్య వివాహాలపై జిల్లాల వారీగా వచ్చిన సమాచారం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన అధికారులు వాటిని అడ్డుకుని తల్లిదండ్రులు, పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు
బాల్య వివాహాలు చేసే వారిపైన, వాటిని ప్రోత్సహించే వారిపైన బాల్య వివాహా నిషేధ చట్టం–2006 ప్రకారం చర్యలు తప్పవు. బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. గతేడాది కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలోనే 165 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. ఇకపై బాల్య వివాహాలు చేస్తున్నట్టు సమాచారం వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తాం. అప్పటికీ మాట వినకపోతే కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, తల్లిదండ్రులతో విభేదించే బాలికలను పునరావాస కేంద్రాల్లో ఉంచి చదువు, ఉపాధి కల్పన ఏర్పాట్లు చేస్తాం.     
– కృతికా శుక్లా, డైరెక్టర్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top