విద్యార్థుల ‘ఉక్కు’ పిడికిలి

Students march in protest of privatization of steel plant - Sakshi

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా స్టూడెంట్స్‌ మార్చ్‌

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల హోరు

డాబా గార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదం తొక్కారు. స్టూడెంట్స్‌ మార్చ్‌ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. 1966 నవంబర్‌ 1న వన్‌టౌన్‌ ప్రాంతంలో విశాఖ ఉక్కు సాధన కోసం జరిగిన ప్రదర్శనపై అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మంది నగర విద్యార్థులను పొట్టన పెట్టుకున్న రోజును పురస్కరించుకుని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం పెద్దఎత్తున ప్రదర్శన చేపట్టారు.

ఏవీఎన్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కొత్త రోడ్డు మీదుగా పాత పోస్టాఫీస్‌ వరకు సాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూఫ్‌ బిశ్వాస్‌ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి పూనుకుందని విమర్శించారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కి మహేషరీ మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు.. ఇలా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌.నరసింగరావు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు మంత్రి రాజశేఖర్, ఎం.జగ్గునాయుడు, కమిటీ ప్రతినిధి డాక్టర్‌ కొల్లా రాజమోహన్, ఆదినారాయణ, ప్రసన్నకుమార్, హరీష్‌కుమార్, జాన్సన్, రామ్మోహనరావు, కుసుమ, చిన్నారి, పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top